న్యూఢిల్లీ: ఢాకా అల్లర్ల కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) కోర్టు విధించిన మరణ శిక్షతో పాటు ఆమెను అప్పగించాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిపై భారత్ అధికారికంగా స్పందించింది. షేక్ హసీనాకు సంబంధించిన తీర్పును తాము గమనించామని, బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది.
‘‘మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ వెలువరించిన తీర్పును ఇండియా గుర్తించింది. పొరుగు దేశమైనా బంగ్లాదేశ్‌లో శాంతి, ప్రజాస్వామ్యం, సమ్మిళితత్వం, స్థిరత్వంతో పాటు ఆ దేశ ప్రజల ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉంది. ఈ లక్ష్యంతో మేము ఎల్లప్పుడూ అన్ని వాటాదారులతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం’’ అని ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం (నవంబర్ 17) ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, ఢాకా అల్లర్ల కేసులో ఐసీటీ హసీనాకు మరణశిక్ష విధించిన తర్వాత ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ అధికారికంగా భారతదేశాన్ని కోరింది. నిందితుల అప్పగింతకు సంబంధించి ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం గుర్తు చేసింది. ఢాకా అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ విడిచిపారిపోయిన షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
అసలేం జరిగిందంటే..?
2024 జూలై, ఆగస్ట్‌లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలను షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ అణిచివేశారు. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగి నిరసనకారులు, పోలీసులు మృతి చెందారు. అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. ప్రాణ భయంతో షేక్ హసీనా దేశం విడిచిపారిపోయింది.
►ALSO READ | పూర్తిగా రాజకీయ ప్రేరేపితం: మరణ శిక్షపై తొలిసారి స్పందించిన షేక్ హసీనా
షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. 2024 జూలై, ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను అప్పటి ప్రధాని షేక్ హసీనా క్రూరంగా అణిచివేశారని ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి.
ఈ క్రమంలోనే ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ విచారణ జరిపి ఈ కేసులో షేక్ హసీనాను దోషిగా తేల్చి ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఐసీటీ తీర్పు అనంతరం ఇండియాలో తలదాచుకుంటున్న హసీనాను అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ కోరింది. మరీ షేక్ హసీనాను అప్పగించాలన్న బంగ్లా ప్రభుత్వ విజ్ఞప్తిపై ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
