పూర్తిగా రాజకీయ ప్రేరేపితం: మరణ శిక్షపై తొలిసారి స్పందించిన షేక్ హసీనా

పూర్తిగా రాజకీయ ప్రేరేపితం: మరణ శిక్షపై తొలిసారి స్పందించిన షేక్ హసీనా

ఢాకా: ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) కోర్టు విధించిన మరణ శిక్షపై బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. ఈ తీర్పు పూర్తి పక్షపాతంతో కూడినదని, రాజకీయంగా ప్రేరేపించబడినదని అభివర్ణించారు. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ రాజకీయాల నుంచి తనను శాశ్వతంగా తొలగించే లక్ష్యంతో ఢాకా అల్లర్ల కేసులో ప్రతీకారపూరిత ప్రాసిక్యూషన్ నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు.

 ఈ కేసు విచారణ ముందస్తుగా ముగిసిన ముగింపు అని ఆరోపించారు. కోర్టులో నన్ను నేను సమర్థించుకోవడానికి, నాకు నచ్చిన న్యాయవాదులు కూడా నా తరపున వాదించడానికి తగిన అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. ఐసీటీలో అంతర్జాతీయంగా ఏమీ లేదని.. అది ఏ విధంగానూ నిష్పాక్షికంగా లేని ట్రిబ్యునల్ అని అభివర్ణించారు. ప్రపంచంలో ఏ ప్రొఫెషనల్ న్యాయనిపుణుడు బంగ్లాదేశ్ ఐసీటీని ఆమోదించరని అన్నారు. తన అవామీ లీగ్‌ పార్టీని రద్దు చేయడానికి కోర్టును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ రాజ్యాంగ విరుద్ధంగా తీవ్రవాద శక్తుల మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకున్నారనిఆరోపించారు. 

►ALSO READ | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష

యూనస్ పాలనలో విద్యార్థులు, వస్త్ర కార్మికులు, వైద్యులు, ఉపాధ్యాయుల నిరసనల అణచివేశారన్నారు. శాంతియుత ప్రదర్శనకారులను కాల్చి చంపారని అలాగే కొందరు జర్నలిస్టులను వేధించారన్నారు. యూనస్ దళాలు దేశవ్యాప్తంగా ప్రతీకార దాడులను పర్యవేక్షించాయని, అవామి లీగ్ నాయకులు, కార్యకర్తలకు చెందిన వందలాది ఇళ్ళు, వ్యాపారాలు, ఆస్తులను ధ్వంసం చేశాయని హసీనా ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలు సరైన న్యాయస్థానంలో ఎదుర్కోవడానికి తాను భయపడనని స్పష్టం చేశారు. తటస్థ అంతర్జాతీయ వేదికపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని హసీనా పునరుద్ఘాటించారు.

అసలేం జరిగిందంటే..?

2024 జూలై, ఆగస్ట్‎లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలను షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ అణిచివేశారు. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగి నిరసనకారులు, పోలీసులు మృతి చెందారు. అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. ప్రాణ భయంతో షేక్ హసీనా దేశం విడిచిపారిపోయింది.

 షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. 2024 జూలై, ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను అప్పటి ప్రధాని షేక్ హసీనా క్రూరంగా రంగా అణివేశారని ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి.  ఈ క్రమంలోనే  ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ విచారణ జరిపి ఈ కేసులో షేక్ హసీనాను దోషిగా తేల్చి ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.