జిన్నింగ్‌ మిల్లుల యజమానులు సమ్మె ఉపసంహరించుకోవాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

జిన్నింగ్‌ మిల్లుల యజమానులు సమ్మె ఉపసంహరించుకోవాలి :  కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ, వెలుగు: జిల్లాలో పత్తి కొనుగోళ్ల పై జిల్లా  కలెక్టర్ ఇలా త్రిపాఠి  ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులు, వ్యవసాయాధికారులతో సమీక్షించారు. పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం నుంచి తలపెట్టిన సమ్మె ను జిన్నింగ్ మిల్లుల యజమానులు  విరమించుకోవాలని కలెక్టర్ కోరారు. జిన్నింగ్ మిల్లుల యజమానుల  సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు.  రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్ తో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని 23 జిన్నింగ్ మిల్లులకు గాను ఇప్పటివరకు 19 మిల్లులను ప్రారంభించామన్నారు.  4 జిన్నింగ్  మిల్లులను సాధ్యమైనంత త్వరలో  ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

రాష్ట్ర అసోసియేషన్ తో మాట్లాడిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని జిన్నింగ్ మిల్లుల యజమానులు తెలిపారు.  ప్రస్తుతం పత్తి రైతులు కేవలం 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే అమ్ముకునేందుకు వెసులుబాటు ఉందని, ప్రభుత్వం దాన్ని ఇప్పుడు 12 క్వింటాళ్ల  వరకు అమ్ముకునేందుకు సడలించారని తెలిపారు. అయితే పత్తి రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి లేదా  వ్యవసాయ అధికారి ద్వారా ధ్రువపత్రాన్ని తీసుకువచ్చి పత్తిని అమ్ముకోవాలని కలెక్టర్ సూచించారు.  ప్రభుత్వం ఏఈఓల సాఫ్ట్వేర్ లో 12 క్వింటాల వరకు పత్తిని అమ్మేందుకు అవకాశం కల్పించిన విషయాన్ని  రైతులకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, జిన్నింగ్ మిల్లుల యజమానులు హాజరయ్యారు.