వివాదాల పరిష్కారానికి... భూముల రీ సర్వే..! పైలట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కింద సూర్యాపేట జిల్లాలో 14 గ్రామాలు ఎంపిక

వివాదాల పరిష్కారానికి... భూముల రీ సర్వే..! పైలట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కింద సూర్యాపేట జిల్లాలో 14 గ్రామాలు ఎంపిక
  • ఇప్పటికే నోటిఫికేషన్‌‌‌‌ జారీ, టెండర్లు పూర్తికాగానే సర్వే స్టార్ట్‌‌‌‌
  • రైతుకు చెందిన అన్ని భూములకు కలిపి ఒకే భూధార్‌‌‌‌ నంబర్‌‌‌‌ కేటాయింపు

సూర్యాపేట, వెలుగు : భూసమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చినా.. వివాదాలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదు. ఈ నేపథ్యంలో భూముల డిజిటల్‌‌‌‌ రీ సర్వే చేపట్టి భవిష్యత్‌‌‌‌లో ఎలాంటి వివాదాలు లేకుండా క్రయవిక్రయాలు జరిగేలా నక్షలను తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

ఇందులో భాగంగా పైలట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కింద సూర్యాపేట జిల్లాలోని 8 మండలాల్లో 14 గ్రామాలను ఎంపిక చేసి సర్వే కోసం నోటిఫికేషన్‌‌‌‌ సైతం జారీ చేసింది. ఈ గ్రామాల్లో సర్వే పూర్తి కాగానే రాష్ట్ర వ్యాప్తంగా మరో 70 గ్రామాల్లో భూముల సర్వే చేపట్టేందుకు అధికారులు ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేశారు. 

30 ఏండ్లకు ఒకసారి చేపట్టాల్సి ఉండగా..

భూముల రీ సర్వేను ప్రతి 30 ఏండ్లకు ఒకసారి చేపట్టాల్సి ఉంది. కానీ కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి సర్వే చేపట్టకపోవడంతో భూతగాదాలు, గొడవలు పెరిగిపోయాయి. భూములకు సంబంధించి సరిహద్దు వివాదాలు, సర్వే నంబర్లు, బై నంబర్లు సరిగా లేకపోవడం ఆఫీసర్లకు సైతం తలనొప్పిగా మారింది. భూముల సరిహద్దులు రికార్డుల్లో ఒక విధంగా, క్షేత్రస్థాయిలో మరో రకంగా ఉండడంతో ఎన్నో వివాదాలు తలెత్తుతున్నాయి. 

పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించడం, భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం భూముల రీ సర్వే మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గతంలో రాష్ట్రవ్యాప్తంగా నక్షలు లేని ఐదు గ్రామాలను ఎంపిక చేసి డిజిటల్‌‌‌‌ సర్వేను  విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు మరో 14 గ్రామాల్లో సర్వే చేసేందుకు చర్యలు చేపట్టింది.

పాత రికార్డులను పరిశీలిస్తూ..

భూమి కొలతలు, రికార్డుల శాఖ ఆధ్వర్యంలో భూముల రీ సర్వే ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూముల రీసర్వేపై ఇటీవల హైదరాబాద్‌‌‌‌లోని సర్వే భవన్‌‌‌‌లో సర్వే అండ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్లు, సర్వేయర్లకు ట్రైనింగ్‌‌‌‌ సైతం ఇచ్చారు. ఈ డిజిటల్‌‌‌‌ సర్వే కోసం శాటిలైట్‌‌‌‌ సహకారం తీసుకోనున్నారు. జీఐఎస్‌‌‌‌ పద్ధతిలో పాత రికార్డుల ఆధారంగా అప్పటి పట్టాలను పరిశీలిస్తూ రీ సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ సర్వేయర్లతో పాటు లైసెన్డ్స్‌‌‌‌ సర్వేయర్ల సేవలను సైతం వినియోగించుకోనున్నారు.

భూధార్‌‌‌‌ నంబర్‌‌‌‌ కేటాయింపు

సూర్యాపేట జిల్లాలో ఎంపిక చేసిన 14 గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా సర్వే చేసి రైతుల కమతాలు, సరిహద్దులను ఖరారు చేయనున్నారు. వాటికి ల్యాండ్‌‌‌‌ పార్ట్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ను రూపొందించి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పొందుపర్చనున్నారు. భూముల వివరాలు, ఆకాంక్ష, రేఖాంశాల సమాచారాన్ని సైతం ముద్రిస్తారు. ఓ రెవెన్యూ గ్రామంలో రైతుకు ఉన్న వివిధ సర్వే నంబర్లలోని భూములను ఒకచోటుకు చేర్చి భూదార్‌‌‌‌ నంబర్‌‌‌‌ కేటాయించనున్నారు.

జిల్లాలో రీ సర్వే జరగనున్న గ్రామాలివే..

గరిడేపల్లి మండలంలోని కాల్వపల్లి, గానుగుబండ, సర్వారం, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ మండలంలోని లింగగిరి, అమరవరం, లక్కారం, నడిగూడెం మండలంలోని నడిగూడెం, కాగితా రామచంద్రాపురం, అనంతగిరి మండలంలోని వాయిలాసింగారం, గొండ్రియాల, చిలుకూరు మండలంలోని చిలుకూరు, మునగాల మండలంలోని రేపాల, జాజిరెడ్డిగూడెం మండలంలోని జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట మండలంలోని యండ్లపల్లి గ్రామంలో అధికారులు రీ సర్వే చేపట్టనున్నారు. 

త్వరలోనే సర్వే మొదలు 

జిల్లాలో ఎంపిక చేసిన 14 గ్రామాల్లో భూములను రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌‌‌‌ సైతం ఇచ్చాం. టెండర్లు ఖరారు కాగానే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రీ సర్వే చేస్తాం. ఇది పూర్తి కాగానే మరో 70 గ్రామాల్లో భూముల రీసర్వేకు ప్రతిపాదనలు పంపాం.

- శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ఏడీ, ల్యాండ్‌‌‌‌ అండ్‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌