చట్టానికి ఎవరూ అతీతులు కాదు: షేక్ హసీనా మరణ శిక్షపై యూనస్ రియాక్షన్

చట్టానికి ఎవరూ అతీతులు కాదు: షేక్ హసీనా మరణ శిక్షపై యూనస్ రియాక్షన్

న్యూఢిల్లీ: ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) కోర్టు విధించిన మరణ శిక్షపై బంగ్లా తాత్కలిక ప్రధాని మహ్మద్ యూనస్ రియాక్ట్ అయ్యారు. ఐసీటీ తీర్పు చట్టానికి ఎవరూ అతీతులు కారని.. చట్టం ముందు అందరూ సమానమేనని ఒక బలమైన సందేశాన్ని ఇచ్చిందన్నారు. ఈ తీర్పు అధికారంతో సంబంధం లేకుండా అత్యంత శక్తివంతమైన వారిని కూడా జవాబుదారీగా ఉంచాలనే స్పష్టమైన మెసేజ్ ఇచ్చిందని పేర్కొన్నారు. 

2024, జూలై, ఆగస్టులో జరిగిన అల్లర్లలో మరణించిన వేలాది మందికి ఈ తీర్పు పూర్తిగా న్యాయం అందించలేదన్నారు. మరణించిన వారు గణాంకాలు కాదని.. విద్యార్థులు, తల్లిదండ్రులు, హక్కులు కలిగిన పౌరులు అని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల తిరుగుబాటును షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆదేశించడం ద్రోహంగా ఆయన అభివర్ణించారు. సంవత్సరాల తరబడి అణచివేత వల్ల దెబ్బతిన్న ప్రజాస్వామ్య పునాదులను పునర్నిర్మించుకునే అవకాశం బంగ్లాదేశ్‌కు ఇప్పుడు లభించిందని వ్యాఖ్యానించారు. 

►ALSO READ | షేక్ హసీనా మరణ శిక్షపై స్పందించిన భారత్.. మాజీ ప్రధాని అప్పగింతపై ఏం చెప్పిందంటే..?

కాగా,  ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని  షేక్ హసీనాను దోషీగా తేలుస్తూ ఆమెకు మరణశిక్ష ఖరారు చేసింది. షేక్ హసీనాతో పాటు ఈ కేసులో బంగ్లా మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‎కు కూడా మరణశిక్ష విధించింది కోర్టు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై షేక్ హసీనాపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

వీటిపై విచారణ సందర్భంగా వాదనలు విన్న ఐసీటీ న్యాయస్థానం.. నవంబర్ 17న ఆమెను దోషిగా తేల్చింది. హసీనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. 2024లో జరిగిన విద్యార్థుల ఆందోళన సందర్భంగా మానవత్వానికి మచ్చ కలిగించే విధంగా అమాయకులను కాల్చి చంపాలని ఆమె ఆదేశాలు జారీ చేశారని కోర్టు చెప్పింది. అల్లర్లలో1400 మంది వరకు మరణించారని న్యాయమూర్తి వెల్లడించారు.