HCA కేసులో ఫోర్జరీ సంతకాల వెనుక కుట్ర ఏంటి.?

HCA  కేసులో  ఫోర్జరీ సంతకాల వెనుక కుట్ర ఏంటి.?
  • మొదటి రోజు కస్టడీలో శ్రీచక్ర క్రికెట్​ క్లబ్​ అధ్యక్షురాలు కవిత,
  • గౌలిపుర క్రికెట్‌‌ క్లబ్‌‌ను శ్రీచక్ర క్రికెట్‌‌ క్లబ్‌‌గా ఎందుకు మార్చారు
  • అధ్యక్షుడు కృష్ణయాదవ్ సంతకం ఎందుకు ఫోర్జరీ చేశారు
  • మొదటి రోజు కస్టడీలో నిందితులపై సీఐడీ  ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌, వెలుగు: హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం జగన్‌మోహన్‌ రావు పన్నిన కుట్రను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది సీఐడీ. ఈ మేరకు శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త శ్రీ చక్ర క్రికెట్ క్లబ్​సెక్రటరీ రాజేందర్‌ ‌యాదవ్‌ నుంచి సమాచారం రాబడుతున్నది. ప్రధానంగా మాజీ మంత్రి కృష్ణయాదవ్‌ సంతకాలు ఫోర్జరీ చేసి హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పోటీకి దిగడం వెనుకున్న వివరాలను సేకరిస్తున్నది. కోర్టు అనుమతి మేరకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు సహా ఐదుగురు నిందితులను సీఐడీ అధికారులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. 

చంచల్‌గూడ మహిళా జైలులో ఉన్న కవితను, చర్లపల్లి జైలులో ఉన్న జగన్‌మోహన్‌రావు సహా నలుగురు నిందితులను రెడ్‌ హిల్స్‌లోని సీఐడీ రీజినల్ ఆఫీస్‌కు తరలించారు. న్యాయవాది సమక్షంలో ప్రశ్నించారు. ఫోర్జరీ కేసుతో పాటు ఐపీఎల్‌ టికెట్ల వివాదం,హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి జగన్‌మోహన్‌రావు, ట్రెజరర్‌ ‌జేఎస్‌ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్‌కాంటే, రాజేందర్‌ యాదవ్‌, ఆయన భార్య కవితను ఈ నెల 22 వరకు కస్టడీలో ప్రశ్నించనున్నారు. మొదటి రోజు కస్టడీలో నిందితుల వ్యక్తగత వివరాలు, క్రికెట్‌ సహా ఇతర క్రీడలకు సంబంధించిన వివరాలతో స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసినట్లు తెలిసింది. గౌలిపుర క్రికెట్‌ క్లబ్‌ను శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌గా మార్చడానికి గల కారణాలను అధ్యక్షురాలు కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్‌ల నుంచి సేకరించినట్లు సమాచారం. ప్రధానంగా జగన్‌మోహన్‌ రావు అధ్యక్షుడు కావడానికి వీరిద్దరూ ఎలాంటి సహాయ సహకారాలు అందించారనే కోణంలో సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. రెండో రోజు కస్టడీలో భాగంగా శుక్రవారం విచారించేందుకు ప్రశ్నలు సిద్ధం చేసినట్టు సమాచారం.