
- ఘరానా నేరస్తులకు, కవితకు తేడా ఏముంది?
- క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పెబ్బేరు, వెలుగు : లిక్కర్ స్కాంలో కోట్లు కొల్లగొట్టిన కల్వకుంట్ల కవితకు, ఘరానా నేరస్తులకు పెద్ద తేడా లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల్లో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వానిది కబ్జాల చరిత్ర అని, పెబ్బేరు వేణుగోపాల స్వామి గుడి భూములను కబ్జా చేసిన ఘనత అధికార పార్టీ నేతలకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఏ కాంట్రాక్టులు తీసుకోవాలన్నా సీఎం, మంత్రులు, అధికార పార్టీల నేతల అనుచరులకు, వాళ్ల బంధువులకే ఇస్తున్నారని ఆరోపించారు. మీరేమో బంగ్లాలో ఉండాలె.. మా బీసీ బిడ్డలు, సామాన్య ప్రజలు బిచ్చమెత్తుకోవాల్నా అని ప్రశ్నించారు.
టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లను ఒక్కొక్కటి రూ.10లక్షలకు అమ్ముకుని నిరుద్యోగులను నట్టేట ముంచారన్నారు. రాష్ట్రంలో రైతులను అడ్డా కూలీలుగా మార్చారన్నారు. రాష్ట్రంలో 8,000 మంది రైతులు సూసైడ్ చేసుకుంటే.. మరో రాష్ట్రానికి వెళ్లి తమ దగ్గర రైతుల ఆత్మహత్యలే లేవని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. ఇప్పటి దాకా ఏ స్కూల్ ను కూడా విజిట్ చేయని ఘనత కేసీఆర్ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను గద్దె దించుదామని, రాబోయే రోజుల్లో వనపర్తి నియోజకవర్గంలో బహుజన జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా ఇన్చార్జి చెన్నరాములు, గణపతి నాయుడు పాల్గొన్నారు.
జంగ్ సైరన్ మోగించాలే..
గద్వాల, వెలుగు: విద్యుత్ ఎంప్లాయీస్తమ న్యాయమైన డిమాండ్ల కోసం వెంటనే జంగ్ సైరన్ మోగించాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఇటిక్యాల మండలంలోని వావిలాల, సాతర్ల, ఉదండాపురం, పెద్దదిన్నె గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 శాతం పీఆర్సీ ఇవ్వాలని విద్యుత్ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తే వారిని బెదిరించి భయపెట్టి కేవలం ఏడు శాతానికే పరిమితం చేశారని ఆరోపించారు. ఆర్జిజన్లకు సౌలతులు కల్పించకుండా సెకండ్ గ్రేడ్ ఉద్యోగులుగా చిన్న చూపు చూశారన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ తో జాగ్రత్తగా ఉండాలని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే యూపీ లాంటి ఘటనలే ఇక్కడ జరుగుతాయని ఆరోపించారు. కార్యక్రమంలో కేశవరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.