సెకండ్ వేవ్ కట్టడికి సర్కార్ ప్లాన్ ఏది?

సెకండ్ వేవ్ కట్టడికి సర్కార్ ప్లాన్ ఏది?
  • రెండు వారాలుగా ఎక్కువవుతున్న బాధితులు
  • పాజిటివ్‌‌ పేషెంట్లకు సరిగ్గా ట్రీట్‌‌మెంట్‌‌ అందుతలే
  • జిల్లాల్లోని సర్కార్​ దవాఖాన్లలో ఆగిన కరోనా ట్రీట్​మెంట్​
  • అప్పులు చేసి ప్రైవేట్‌‌ హాస్పిటళ్లకు పోతున్న పేషెంట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నయి.. సెకండ్‌‌ వేవ్‌‌ భయపెడుతోంది.. కానీ కట్టడి చర్యలు మాత్రం కనిపించడం లేదు.  ‘సెకండ్‌‌ వేవ్‌‌ మొదలైంది. జాగ్రత్త’ అంటూ హెచ్చరించడం మినహా వైరస్ కంట్రోల్​కు ఇంతవరకు ప్రభుత్వం వద్ద యాక్షన్​ ప్లాన్​ లేదు.  వైరస్ సోకిన వారికి ట్రీట్‌‌మెంట్‌‌ కూడా సరిగా అందడంలేదు. హోం ఐసోలేషన్‌‌ కిట్లు ఇవ్వడం ఆపేశారు. మే నాటికి రాష్ట్రంలో సెకండ్‌‌ వేవ్‌‌ పీక్స్‌‌కు చేరే అవకాశముందని చెప్తున్నా, ఆ పరిస్థితి తలెత్తకుండా నివారణ చర్యలను సర్కారు చేపట్టట్లేదు. నెల క్రితం వరకు రోజుకు వందలోపు కేసులువస్తే.. ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారమే నాలుగు రెట్లు ఎక్కువ కేసులు వస్తున్నాయి. ప్రైవేట్‌‌ హాస్పిటళ్లలో కరోనా బెడ్లన్నీ ఫుల్‌‌ అవుతున్నాయి. ప్రభుత్వ దవాఖాన్లకు పెద్దగా పేషెంట్లు వెళ్లడం లేదు. 10 నుంచి 20 ఏళ్లలోపు వారిలోనూ వైరస్‌‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఏప్రిల్‌‌ నెలాఖరు, మే మొదటి వారానికి కల్లా సెకండ్‌‌ వేవ్‌‌ పీక్స్‌‌కు చేరుతుందని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ అధికారులే చెప్తున్నారు.

90 శాతం మందికి లక్షణాల్లేవ్‌‌

సెకండ్‌‌ వేవ్‌‌ వైరస్‌‌ సోకిన వారిలో 80 నుంచి 90 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు. కేవలం పది శాతం మందిలో జలుబు, దగ్గు, కొద్దిపాటి జ్వరం, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వాళ్లలో సగం మంది కరోనా టెస్టులు చేయించుకోవడం లేదు. టెస్టులు చేయించుకుని వైరస్‌‌ నిర్ధారణ అయిన వాళ్లు హాస్పిటళ్లకు వెళ్లడం లేదు. ఇష్టం వచ్చినట్లు జనంలో తిరుగుతూ వైరస్‌‌ వ్యాప్తికి కారకులవుతున్నారు. అలాంటి వారిని హాస్పిటల్‌‌, హోం ఐసోలేషన్‌‌లో ఉంచి ట్రీట్‌‌మెంట్‌‌ అందించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సెక్రటేరియట్‌‌లో పనిచేస్తున్న కొందరు ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగులు తమకు పాజిటివ్‌‌ వచ్చిన విషయాన్ని దాచిపెట్టి డ్యూటీలకు రావడం సర్కారు నిర్లక్ష్యానికి ఓ ఉదాహరణ మాత్రమే. మరోవైపు ఆర్టీపీసీఆర్‌‌ కాకుండా యాంటిజెన్‌‌ టెస్టులపై ఎక్కువగా ఆధారపడటం కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నట్టుగా తెలుస్తోంది. యాంటిజెన్‌‌ టెస్టుల్లో ఫాల్స్‌‌ నెగటివ్‌‌ రిపోర్టుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఇలా నెగిటివ్‌‌ రిపోర్టు వచ్చిన వాళ్లు ఇష్టారాజ్యంగా తిరుగుతూ వైరస్‌‌ స్ప్రెడ్‌‌ చేస్తున్నారు.

కంట్రోల్‌‌ రూం పని చేస్తలే

గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌లో కరోనా వచ్చిన వారికి సేవలందించేందుకు కంట్రోల్‌‌ రూం ఏర్పాటు చేశారు. జీహెచ్‌‌ఎంసీ, హెల్త్‌‌, పోలీస్‌‌ తదితర శాఖలు సమన్వయంతో పని చేసి పేషెంట్లకు సేవలందించాల్సి ఉంటుంది. వైరస్‌‌ సోకి హోం ఐసోలేషన్‌‌లో ఉన్న వారికి కరోనా కిట్లు ఇవ్వడం, వారి ప్రైమరీ కాంటాక్టులకు టెస్టులు చేయించడం తదితర పనులన్నీ ఈ కంట్రోల్‌‌ రూం ద్వారానే చేయాల్సి ఉంటుంది. కానీ పాజిటివ్‌‌గా తేలి హోం ఐసోలేషన్‌‌లో ఉన్న వాళ్లు ఫోన్‌‌ చేసినా కంట్రోల్‌‌ రూం సిబ్బంది పట్టించుకోవడం లేదు. జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎవరికైనా పాజిటివ్‌‌గా తేలితే వాళ్లే సొంతంగా ట్రీట్‌‌మెంట్‌‌ చేయించుకుంటున్నారు. వారి ప్రైమరీ కాంటాక్టులకు టెస్టులు చేయట్లేదు.

అప్పులు చేసి ప్రైవేట్‌‌ హాస్పిటళ్లకు..

కరోనా సోకి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వాళ్లంతా ప్రైవేట్‌‌ హాస్పిటళ్లకు వెళ్తున్నారు. ఆర్థిక స్థోమత లేని వాళ్లు అప్పులు చేసి మరీ ప్రైవేట్‌‌కే పోతున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్యంపై నమ్మకం లేకపోవడంతోనే ప్రైవేట్‌‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం గవర్నమెంట్‌‌ హాస్పిటళ్లలో 800 మంది పేషెంట్లు ఉండగా, ప్రైవేట్‌‌లో 2 వేల మందికిపైగా ట్రీట్​మెంట్ పొందుతున్నారు.

రాష్ట్రంలో మరో463 మందికి కరోనా

రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు 42,461 టెస్టులు చేయగా.. 463 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ డిపార్ట్ మెంట్ మంగళవారం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,07,205కు చేరిందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,678 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.  కరోనాతో మరో నలుగురు చనిపోయారని ప్రకటించింది. దీంతో మృతుల సంఖ్య 1,694కు చేరిందని తెలిపింది.

అప్పట్లో మస్తు హడావుడి

నిరుడు మార్చిలో రాష్ట్రంలో కరోనా వైరస్‌‌ వ్యాప్తి మొదలైంది. అప్పుడు లాక్‌‌డౌన్‌‌, కంటెయిన్​మెంట్ ఏరియాలు, ట్రేసింగ్‌‌.. టెస్టింగ్‌‌.. ట్రీట్‌‌మెంట్‌‌ పేరుతో ప్రభుత్వం హడావుడి చేసింది. రెండు నెలల తర్వాత చల్లబడింది. కట్టడి చర్యలను తగ్గిస్తూ వచ్చింది. వైరస్‌‌ గురించి ప్రజలను అలర్ట్‌‌ చేయడం మరిచిపోయింది. హైకోర్టు ఆదేశిస్తే గాని టెస్టుల సంఖ్య పెంచలేదు. వైరస్‌‌ తీవ్రత తగ్గుముఖం పట్టిందనే సంకేతాలు ప్రభుత్వం వైపు నుంచే రావడంతో ప్రజలు కరోనాను లైట్‌‌ తీసుకోవడం మొదలు పెట్టారు.

డేంజరస్​గా సెకండ్‌‌ వేవ్‌‌

కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ వేగంగా విస్తరిస్తోంది. రోజుకు 500 లోపు కేసులు మాత్రమే వస్తున్నాయని ప్రభుత్వం బులెటిన్‌‌లో చెప్తున్నా, వాస్తవ పరిస్థితి ఇంకోలా ఉంది. ప్రైవేట్‌‌ హాస్పిటళ్లలో చేస్తున్న టెస్టుల వివరాలను సర్కారు బయటికి చెప్పట్లేదు. 

జిల్లాల్లో దిక్కులేదు

జిల్లాల్లో కరోనా పేషెంట్ల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ ప్రభుత్వ దవాఖాన్లలో కరోనా ట్రీట్​మెంట్ బంజేయడంతో పేషెంట్లు హైదరాబాద్​కు పోవాల్సి వస్తోంది. కొంతమంది సొంతంగానే ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. 

కిట్స్ ఇస్తలే

హోం ఐసోలేషన్​లో ఉన్న వారికి చాలా రోజులుగా కిట్స్ ఇవ్వడం లేదు. దీంతో పేషెంట్లు మెడిసిన్ల కోసం బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కంట్రోల్ రూం.. నాట్ వర్కింగ్

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం పని చేయడం లేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లు ఫోన్‌ చేసినా కంట్రోల్‌ రూం సిబ్బంది పట్టించుకోవడం లేదు.
రోజూ 50 వేల టెస్టులు చేస్తున్నం. కరోనా సోకిన వాళ్లు ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లి జేబులు గుళ్ల చేసుకోవద్దు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనా ట్రీట్‌‌మెంట్‌‌కు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏపీ, కర్నాటక పేషెంట్లు కూడా హైదరాబాద్‌‌కు వచ్చి ట్రీట్‌‌మెంట్‌‌ చేయించుకుంటున్నారు. అందుకే ప్రైవేట్‌‌ బెడ్స్‌‌ ఎక్కువగా ఫిల్‌‌ అవుతున్నాయి. కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజూ 50 వేల టెస్టులు చేస్తున్నాం. సెకండ్‌‌ వేవ్‌‌లో లక్షణాలు లేనివాళ్లే 80 శాతానికిపైగా ఉన్నారు. వాళ్లతో వైరస్‌‌ వ్యాప్తి చెందే అవకాశముంది.
- శ్రీనివాస్‌రావు, డైరెక్టర్‌‌, పబ్లిక్‌‌ హెల్త్‌‌