తెలంగాణలో కాంగ్రెస్ బలగమెంత?

తెలంగాణలో  కాంగ్రెస్ బలగమెంత?

నల్గొండ, వెలుగు:  కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో తమ పార్టీ బలగం ఎంతుందో తేల్చే పనిలో పడింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న ఆ పార్టీ నేతలు ఫీల్డ్​లెవెల్​లో తమకు ఎంతమంది ఓటర్ల మద్దుతుందో తెలుసుకునేందుకు ‘ఓటర్​మ్యాపింగ్’ పేరుతో అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేపడుతున్నారు. దీనిని సక్సెస్​చేసేందుకు పక్క రాష్ట్రాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్​లీడర్లను రంగంలోకి దింపారు. దీని కోసం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకరి చొప్పున ఇన్​చార్జిని నియమించారు. ప్రస్తుతం వారు పార్లమెంట్​సెగ్మెంట్​పరిధిలోని జిల్లా కేంద్రంలో ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్​లెవెల్​ఏజెంట్లతో సమావేశాలు పెడ్తున్నారు. పార్టీ సీనియర్లున్న చోట వాళ్లే స్వయంగా మీటింగులు నిర్వహిస్తున్నారు. 

పార్టీల వారీగా ఓటర్ల గుర్తింపు

నియోజకవర్గాల్లో ఎన్నికల కమిషన్​ప్రకటించిన బూత్​ల ప్రకారం కాంగ్రెస్​పార్టీ నుంచి ఏజెంట్లను నియమించారు. ప్రతి గ్రామంలో 150 నుంచి 200 ఇండ్ల వరకు ఒక బీఎల్ఓను పెట్టారు. గ్రామశాఖ అధ్యక్షుడు, బీఎల్ఓ కలిసి ఇంటింటికి తిరిగి మూడు కేటగిరీల్లో ఓటర్లను గుర్తిస్తారు. ఒక ఇంటిలో కాంగ్రెస్​ పార్టీ ఓటర్లుంటే ఆ జాబితాలో వాళ్ల పేర్ల పక్కన కాంగ్రెస్​ (సీ) అని గుర్తిస్తారు. బీఆర్ఎస్​అయితే (బీ) అని, తటస్థంగా (న్యూట్రల్​) ఉన్న ఓటర్లను (ఎన్​) అని పేర్కొంటారు. ఈ రకంగా ప్రతి బూత్​లెవెల్​లో కాంగ్రెస్​, బీఆర్ఎస్ ఓటర్లు ఎంత మంది ఉన్నారనే లెక్క గడతారు. దీంతోపాటే మొబైల్​ఫోన్​నంబర్లు కూడా తీసుకుంటున్నారు. ఈ లిస్ట్​ఆధారంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలు పెడుతుందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. దీనివల్ల ఎన్నికల ఖర్చు కూడా తగ్గుతుందని అనుకుంటున్నారు. పాంప్లెంట్స్, ప్రకటన రూపంలో కాకుండా కాంగ్రెస్​ మేనిఫెస్టో గురించి, బీఆర్ఎస్​ వైఫల్యాలపైన సెల్​ఫోన్లకు మెసేజ్​లు పంపి ప్రచారం చేయడానికి ఈ ఓటరు లిస్ట్​దోహదపడుతుందని భావిస్తున్నారు.  

బీఆర్ఎస్​ ప్లాన్​కు దీటుగా...  

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్​బలంగా ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సర్వేలు చెబుతుండడంతో గట్టెక్కేందుకు ఆ పార్టీ​సంక్షేమ పథకాలపైనే నమ్మకం పెట్టుకుంది. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధిపొందిన వారి నంబర్లు తీసుకున్న ఆ పార్టీ నేతలు ఎన్నికల టైంలో మేసేజ్​లు పంపించి ప్రచారం చేయాలని ప్లాన్​చేస్తున్నారు. అయితే దీన్ని తిప్పికొట్టేందుకే కాంగ్రెస్ ఓటర్​ మ్యాపింగ్​ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రోగ్రామ్ ​ద్వారా వీలైనంత ఎక్కువమంది ఓటర్లకు కనెక్ట్​ కావాలని చూస్తోంది. తమను అధికారంలోకి తీసుకువస్తే బీఆర్ఎస్​ కంటే అద్భుతంగా ఏం చేయగలుగుతామో చెబుతూ తమ వైపు తిప్పుకునే ఆలోచన చేసినట్టు
 తెలుస్తోంది. 

తేల్చడం సులువేనా? 

2014లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. తొమ్మిదేండ్లు పాలనకు దూరమైంది. ఇన్నేండ్లలో కాంగ్రెస్ ​కేడర్​ చెల్లాచెదురైంది. పార్టీ లాయలిస్టులు మాత్రమే మిగిలారు. ఓటర్​ మ్యాపింగ్​ చేయడానికి అన్ని చోట్లా పార్టీ కేడర్​ఆసక్తి చూపడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్​ సెగ్మెంట్లలో ఉన్న కోదాడ, హుజూర్​నగర్​లలో ఓటర్​ మ్యాపింగ్​నడుస్తోంది. పీసీసీ మాజీ చీఫ్​ఉత్తమ్​కుమార్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కోసం శ్రమిస్తున్నారు. భువనగిరి ఎంపీ సెగ్మెంట్​లో ఇన్​చార్జీగా వచ్చిన కర్నాటక ఎమ్మెల్యే మానె శ్రీనివాస్​సమావేశాలు నిర్వహిస్తున్నారు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్​ఇన్​చార్జీగా కర్నాటక మాజీ సీఎం ధరమ్ సింగ్​ కొడుకు ఎమ్మెల్యే అజయ్​ సింగ్​ను నియమించారు. ఆయన త్వరలోనే మీటింగులు మొదలుపెట్టనున్నట్టు తెలిసింది. అయితే, ఎమ్మెల్యే టికెట్​ కోసం అప్లై చేసుకున్న వాళ్లు దీనిపై ఆసక్తి చూపకపోవడం మైనస్​అవుతోంది. అభ్యర్థిత్వాన్ని తేల్చాకే ఓటర్​ మ్యాపింగ్​చేస్తామని చెప్తుండడంతో పార్టీ సీనియర్​లీడర్లు ఆల్టర్నేట్​దారులు వెతుకుతున్నారు.