డెంగీపై ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

డెంగీపై  ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డెంగీ నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో, ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో చెప్పాలని సర్కారును హైకోర్టు ఆదేశించింది. వారంలోగా పూర్తి వివరాలతో కౌంటర్​వేయాలని స్పష్టం చేసింది. ‘రాష్ట్రంలో డెంగీ వ్యాధి తీవ్రంగా ఉంది. సుమారు1,400కుపైగా కేసులు నమోదు అయినట్లుగా పత్రికల్లో చదివాం. రాష్ట్రంలో వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు కన్పిస్తున్నాయి. జనం రోగాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని హైకోర్టు డివిజన్‌‌ బెంచ్‌‌ వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్‌‌ శివారు కొంపల్లికి చెందిన డాక్టర్‌‌ కరుణ దాఖలు చేసిన పిల్​ను శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారించింది. జనం  డెంగీ బారిన పడుతుంటే ప్రభుత్వపరంగా చర్యలు అంతంతమాత్రమే ఉన్నాయని డాక్టర్‌‌ కరుణ తరఫు లాయర్‌‌ వాదించారు. హైదరాబాద్‌‌ లో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉందని, వేలాది మంది స్టూడెంట్లు ఈ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. గాంధీ, ఉస్మానియా ఇతర ఆస్పత్రుల్లో రోగులు పడిగాపులు పడాల్సి వస్తోందని, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తోందని అడ్వకేట్​జనరల్​బి.ఎస్‌‌. ప్రసాద్‌‌ కోర్టుకు తెలిపారు. ఇంతవరకు తీసుకున్న చర్యలు, ప్రజలకు అవగాహన కల్పించడం వంటివాటిపై వివరాలను సమర్పిస్తామన్నారు. దీంతో తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్‌‌ 7వ తేదీకి వాయిదా వేసింది.