నేనేం తప్పు చేశా..  కార్యకర్తల్ని ఎందుకు శిక్షిస్తున్నరు ?..కన్నీళ్లు పెట్టుకున్న మాజీమంత్రి జీవన్ రెడ్డి

నేనేం తప్పు చేశా..  కార్యకర్తల్ని ఎందుకు శిక్షిస్తున్నరు ?..కన్నీళ్లు పెట్టుకున్న మాజీమంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు : ‘కాంగ్రెస్ కోసం జీవితాన్ని అంకితం చేసి నాలుగు దశాబ్దాలు కష్టపడితే నాకు ఎదురైన అవమానం గుండెల్ని పిండేసింది’ అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తననే కాకుండా తనను నమ్ముకున్న కార్యకర్తలను సైతం టార్గెట్ చేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జగిత్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా జీవన్​ రెడ్డి మాట్లాడుతూ... ‘నేనేం పాపం చేశాను ? నన్ను ఎందుకు గోస పెడుతున్నారు ?, నా మీద కోపం ఉంటే నాపైనే తీర్చుకోండి.. కానీ నన్ను నమ్ముకున్న కార్యకర్తలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నరు ?’ అని ప్రశ్నించారు.

తనను నమ్ముకున్న వారి కోసం చివరి శ్వాస వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన వారితో రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని.. ఈ ఎన్నికల్లో ఫిరాయింపుదారులను ఓటు అనే ఆయుధంతో కొట్టాలని సూచించారు. ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల నోటికాడి బుక్కను ఫిరాయింపుదారులు ఎత్తుకెళ్లారని మండిపడ్డారు.