- రష్యాకు ఇప్పటికే చాలా ‘సోవియట్’ దేశాలు దూరం
- ఉక్రెయిన్ నాటోలో చేరితే మరింత ఇబ్బంది
- అందుకే పొరుగుదేశంపై పంతం పట్టిన పుతిన్
- రష్యాకు చెక్ పెట్టేందుకు అమెరికా, యూరప్ దేశాల యోచన
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్ కంట్రీస్ హెచ్చరించినట్లుగానే.. ఉక్రెయిన్ పై రష్యా ముప్పేట దాడులు షురూ జేసింది. ల్యాండ్, ఎయిర్, సీ రూట్లలో బాంబుల వర్షం కురిపిస్తూ దండయాత్ర మొదలుపెట్టింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అతిపెద్ద మిలిటరీ దాడు లు ఇవే. ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమని చెప్తున్న పుతిన్.. ప్రజలను నరమేధం నుంచి కాపాడేందుకే మిలిటరీ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దాడులను సమర్థించుకునేందుకే తప్పుడు ప్రచారమని వెస్ట్రన్ కంట్రీస్ స్పష్టం చేస్తున్నాయి. అటు రష్యా, ఇటు నాటో దేశాల ఆధిపత్య పోరాటం నడుమ ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజలే ప్రమాదంలో పడ్డారు.
అసలు గొడవేంటి?
మూడు దశాబ్దాల కిందట 1991లో స్వతంత్ర దేశంగా అవతరించక ముందు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది. ప్రస్తుతం 4.40 కోట్ల మంది జనాభా ఉన్న ఉక్రెయిన్‌కు వెయ్యేండ్ల చరిత్ర ఉంది. స్వతంత్ర దేశంగా మారాక విస్తీర్ణం పరంగా యూరప్ లో అతిపెద్ద దేశంగా అవతరించింది. సోవియట్ యూనియన్ పతనం అయ్యాక ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ ప్రజలు రెఫరెండంలో భారీ మెజారిటీతో తేల్చిచెప్పారు. ఆ తర్వాత అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమిలో, యూరోపియన్ యూనియన్‌లో చేరాలన్న నిర్ణయంతోనే రష్యాతో అసలు గొడవ మొదలైంది. పుతిన్ అధ్యక్షుడు అయ్యాక.. ఉక్రెయిన్ ఎప్పుడూ ఒక దేశంగా లేదని, దానిని రష్యా నుంచి ఆర్టిఫిషియల్ గా వేరుచేశారని పదేపదే చెప్తూ వచ్చారు. ఉక్రెయిన్ వెస్ట్రన్ కంట్రీస్ చేతిలో తోలుబొమ్మలా తప్ప ఒక ప్రత్యేక దేశంగా ఉండలేదన్నారు. నాటో కూటమిలోకి ఉక్రెయిన్ను చేర్చుకోరాదని, ఉక్రెయిన్ తటస్థ దేశంగా ఉండాలని, డీమిలిటరైజేషన్ (సాయుధ బలగాలను తగ్గించడం) చేపట్టాలని డిమాండ్ చేశారు. కానీ, నిరుడు జనవరిలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ను కలిసిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్ స్కీ.. తమను నాటోలో చేర్చుకోవాలని కోరారు. దీంతో ఉక్రెయిన్ నాటో, ఈయూలో చేరకూడదని కోరుకుంటున్న రష్యాకు ఆందోళన మొదలైంది.
ఉక్రెయినియన్లు ఏమంటున్రు?
రష్యా దాడులతో ఉక్రెయిన్ ప్రజలు మరోసా రి ఏకమయ్యారు. అందరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతోంది. రష్యన్ భాష మాట్లాడే ప్రజలు సైతం రష్యాకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. 2001లో జరిగిన ఒపీనియన్ పోల్స్ లో.. సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ వేరుపడటాన్ని సగం మంది ప్రజలు సమర్థించారు. ఇప్పుడు 80% పైగా ప్రజలు ఉక్రెయిన్ ఇండిపెండెంట్ దేశంగానే ఉండాలని కోరుకుంటున్నారు. సగానికి పైగా మంది నాటోలో చేరేందుకు మద్దతు తెలుపుతున్నారు.
ఉక్రెయిన్‌పై ఎందుకంత పట్టు?
ఉక్రెయిన్ అంటే అటు రష్యా మాత్రమే కాకుండా ఇటు అమెరికా, యూరప్ కంట్రీస్ కూడా తమకు ముఖ్యమైన ప్రాంతంగా భావిస్తున్నాయి. అటు రష్యాను కట్టడి చేసేందుకు నాటో దేశాలకు, ఇటు నాటో కూటమిని కట్టడి చేసేందుకు రష్యాకు ఈ దేశం ఒక కీలకమైన బఫర్ జోన్ గా మారిపోయింది. అందుకే ఉక్రెయిన్ ఎప్పుడూ తమ చెప్పుచేతల్లో ఉండాలని రష్యా భావిస్తోంది. కొన్ని శతాబ్దాలుగా ఉక్రెయిన్ రష్యన్ ఎంపైర్ లో భాగంగా ఉందని గుర్తు చేస్తోంది. ఉక్రెయిన్ లో రష్యన్ భాష మాట్లాడే ప్రజల సంఖ్య కూడా భారీగానే ఉంది. 1991లో స్వతంత్ర దేశంగా మారేంతవరకూ సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది. 2014లో రష్యాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం కూలిపోయి, వెస్ట్రన్ కంట్రీస్ కు అనుకూల ప్రభుత్వం ఏర్పడటంతో రష్యా ఇరుకునపడిపోయింది. అప్పటికే సోవియట్ యూనియన్ లోని మాజీ మిత్ర దేశాల్లో చాలా దేశాలు యూరోపియన్ యూనియన్ లేదా నాటోలో చేరిపోయాయి. దీంతో తూర్పు యూరప్ లో పట్టును నిలబెట్టుకునేందుకు రష్యాకు ఉక్రెయిన్ ఒక్కటే ఏకైక మార్గంగా మిగిలిపోయింది.
సూపర్మార్కెట్ల వద్ద క్యూ
రష్యా దాడితో ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారింది. కీవ్‌తో పాటు చాటా సిటీల్లో రోడ్ల పైకి వచ్చిన జనం.. నిత్యావసర వస్తువుల కోసం సూపర్‌మార్కెట్లు, మార్ట్ల వద్దకు పరుగులు పెట్టారు. దీంతో అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంది. మిలటరీ ఆపరేషన్ కొనసాగుతున్నందున ఆహార పదార్థాలు నిల్వ చేసుకునేందుకు జనం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అటు డబ్బుల కోసం ఏటీఎంలలోనూ బారులు తీరారు.
