
- సుప్రీంకోర్టు ఆర్డర్ పై సెలబ్రిటీలు, నేతల ఆందోళన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్ సీఆర్ నుంచి వీధి కుక్కలను షెల్టర్ హోంలకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై నేతలు, సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎక్స్’, ‘ఇన్ స్టాగ్రాం’లలో పోస్టులు పెట్టారు. సుప్రీం ఆదేశం అమలు సాధ్యం కాదని బీజేపీ నేత, హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అన్నారు. వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలిస్తే ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బ తింటుందన్నారు. ‘‘కోతుల బెడద పెరుగుతుంది. ఎలుకల సమస్య కూడా పెరుగుతుంది. 1880లో పారిస్ లో ఇదే జరిగింది. దీంతో పారిస్ వాసులకు ఆహార సంక్షోభం ఎదురైంది” అని ఆమె తెలిపారు.
కుక్కలను షెల్టర్ హోంలలో ఉంచడమంటే వాటిని చంపడంతో సమానమని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ అన్నారు. కుక్కలను షెల్టర్ హోంలకు తరలించడం బదులుగా ప్రత్యామ్నాయం చూడాలని నటులు జాన్ అబ్రహం, అడివి శేష్ కోరారు. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ కి వారు లేఖ రాశారు. కోర్టు ఆదేశం కుక్కలకు మరణశిక్ష అని సింగర్ శ్రీపాద చిన్మయ్ అన్నారు. జాహ్నవీ కపూర్, వరుణ్ ధావన్, భూమి పడ్నేకర్, అనన్య పాండ్య తదితరులు కూడా ప్రత్యామ్నాయం చూడాలని కోరారు.
కుక్కలు సమస్య కాదు: రాహుల్, ప్రియాంక వీధి కుక్కలు సమస్య కాదని, వాటిని తరలించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధృ, ప్రియాంక గాంధీ అన్నారు. కుక్కలను తరలించడం క్రూరమైన, దూరదృష్టి లేని చర్య అని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం కుక్కలపై దారుణమైన ప్రభావం చూపుతుందని వారు పేర్కొన్నారు.