హాస్టల్ గోడ దూకుతుండగా కరెంట్​ షాక్..ఇంటర్ స్టూడెంట్ మృతి

హాస్టల్ గోడ దూకుతుండగా కరెంట్​ షాక్..ఇంటర్ స్టూడెంట్ మృతి
  •     కొహెడలోని నారాయణ కాలేజ్  క్యాంపస్​లో ఘటన  
  •     విద్యార్థి సంఘాల ఆందోళన 

ఎల్​బీనగర్, వెలుగు : కాలేజీ బయటకు వెళ్లేందుకు గోడ దూకుతుండగా కరెంట్​ షాక్ కొట్టి ఓ ఇంటర్​ స్టూడెంట్ చనిపోయాడు. రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని హయత్ నగర్  పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని బాపట్లకు చెందిన కర్రే విజయ్ కుమార్ కుటుంబం కొన్నేండ్ల కింద హైదరాబాద్​కు వచ్చి వెస్ట్ మారేడుపల్లిలో నివాసముంటోంది. ఇతడి కొడుకు గిరీశ్​కుమార్(16)ను ఈ నెల12వ తేదీన హయత్ నగర్ మండలం కొహెడలోని నారాయణ  క్యాంపస్ కాలేజీలో ఇంటర్మీడియట్​లో జాయిన్​ చేశారు. అయితే, కిషోర్ తనకు కాలేజీలో చదువుకోవడం ఇష్టం లేదని

 ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు నాలుగు రోజులుగా ఫోన్ చేసి అడుగుతున్నాడు. అయితే, వారు తాము కాలేజీకి వచ్చి మాట్లాడతామని నచ్చజెప్తున్నారు. ఇక కాలేజీలో ఉండనంటూ కిషోర్ గురువారం అర్ధరాత్రి 2 గంటలకు హాస్టల్ గోడ దూకేందుకు ప్రయత్నించాడు. అయితే, పక్కన11 కేవీ కరెంట్​ లైన్ తీగలకు చేయి తగలడంతో షాక్ కొట్టగా అక్కడికక్కడే చనిపోయాడు. శుక్రవారం కిషోర్ కనిపించడం లేదని కాలేజీ మేనేజ్ మెంట్ అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి హయత్ నగర్ పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్ ఇచ్చింది. పోలీసులు వెళ్లి  సీసీ ఫుటేజీలను  పరిశీలించారు. 

హాస్టల్ గోడ అవతలి వైపు వెళ్లి చూడగా చనిపోయి ఉన్న కిషోర్ కనపించాడు. కరెంట్​ షాక్​తో చనిపోయాడని భావించి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మరోవైపు నారాయణ కాలేజీ మేనేజ్ మెంట్ ఒత్తిడి తట్టుకోలేక కిశోర్​ చనిపోయాడని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల లీడర్లు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. పోలీసులు వెళ్లి విద్యార్థి సంఘాల నేతలకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. 

కరెంట్​ షాక్​తో కూలీ మృతి

  •     కుటుంబసభ్యుల ఆందోళన

మెదక్​టౌన్​, వెలుగు :  మెదక్​ లోని ఓ కాలేజీలో చెట్ల కొమ్మలు కొట్టడానికి వచ్చిన వ్యక్తి కరెంట్​షాక్ తో చనిపోయాడు. సీఐ దిలీప్​కుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..బాలానగర్​ తండాకు చెందిన బానోత్​ఫకీరియా (38) శుక్రవారం మెదక్​లోని మహిళా పాలిటెక్నిక్​కాలేజీలో చెట్ల కొమ్మలు కొట్టడానికి వచ్చాడు. ట్రాన్స్​ఫార్మర్​ వద్ద పని చేస్తుండగా ఎర్త్ ​వైర్లు తగిలి షాక్ ​కొట్టి పడిపోయాడు. 

జిల్లా దవాఖానకు తరలించగా చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బాలానగర్​తండావాసులు కాలేజీపై దాడి చేసి అద్దాలు, ఫర్నిచర్​ ధ్వంసం చేశారు. పోలీసులు బాధితులకు నచ్చజెప్పి పంపించారు.