- మంత్రి పొన్నం కృషితో సీఎం ఈ నిధులు ఇచ్చారు
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు : మున్నూరు కాపు సహకార సంఘం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.50 కోట్లను కేటాయించిందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన మున్నూరు కాపు సంఘం స్టేట్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో సీఎం రేవంత్ రెడ్డి తమ సంఘానికి ఈ నిధులు కేటాయించారని చెప్పారు. ఈ మేరకు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
మున్నూరు కాపుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీల ఆర్థిక సాధికారత లక్ష్యంగా రేవంత్ సర్కార్ పని చేస్తుందని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. మున్నూరు కాపుల ఐక్యత కోసం పాటుపడతామన్నారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. మున్నూరు కాపుల తరఫున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మున్నూరు కాపు సహకార సంస్థ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మూడు నెలలకోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
పుట్ట పురుషోత్తమ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం స్టేట్ అపెక్స్ కౌన్సిల్ చైర్మన్‌గా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను, గౌరవ అధ్యక్షులుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. గతంలో అపెక్స్ కౌన్సిల్ చైర్మన్‌గా పనిచేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే చట్టసభలకు ఎన్నికైన మున్నూరు కాపులకు సన్మానించేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని మీటింగ్‌లో నిర్ణయించారు.
ఈ సమావేశంలో కాచిగూడ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర రావు, మున్నూరు కాపు సంఘం స్టేట్ అపెక్స్ కౌన్సిల్ కమిటీ సభ్యులు విట్టల్, రిటైర్డ్ ఐజీ బాలకిషన్ రావు, కనకయ్య, మల్లేశం, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.