సన్న బియ్యంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భోజనం పెట్టండి : విప్ ఆది శ్రీనివాస్

సన్న బియ్యంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భోజనం పెట్టండి : విప్ ఆది శ్రీనివాస్
  •     ప్రభుత్వానికి విప్​ ఆది శ్రీనివాస్​ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం తెచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక పథకాల్లో సన్న బియ్యం పథకం ఒకటని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ అన్నారు. పెద్దోళ్లతో సమానంగా పేదోళ్లు కూడా కడుపునిండా సన్న బియ్యం అన్నం తింటున్నారని చెప్పారు. అసెంబ్లీలో కూడా ఒకసారి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సన్న బియ్యంతో ప్రభుత్వం భోజనం పెట్టించాలని ఆయన కోరారు. గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. రైతుల మద్దతు కాంగ్రెస్​కే ఉందన్నారు. అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మరన్నారు. 

బీఆర్​ఎస్​ హయాంలో కట్టిన ఒకే ఒక్క ప్రాజెక్ట్​ కాళేశ్వరం కూలిపోయిందన్నారు. అయితే, పాడికౌశిక్​ రెడ్డి కల్పించుకుని మల్లన్నసాగర్​, మల్కంపేట రిజర్వాయర్లు ఏ ప్రాజెక్టులో ఉన్నాయో చెప్పాలన్నారు. దానికి బదులిచ్చిన ఆది శ్రీనివాస్.. మల్కంపేటకు శంకుస్థాపన చేసింది శ్రీధర్​ బాబు అని చెప్పారు. వైఎస్​ హయాంలోనే దానికి అంకురార్పణ జరిగిందన్నారు. కాంగ్రెస్​ హయాంలో కట్టిన అన్ని ప్రాజెక్టులూ ఇప్పటికీ సేవలందిస్తున్నాయని చెప్పారు. 

కేసీఆర్​ను సభకు రమ్మనండి: బాలూ నాయక్​

గవర్నర్​ ప్రసంగానికి రాని ఏకైక ప్రతిపక్ష నేతగా కేసీఆర్​ మిగిలిపోతారని కాంగ్రెస్​ ఎమ్మెల్యే బాలూ నాయక్​ అన్నారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీ లతో వచ్చి గవర్నర్​ ప్రసంగంపై నిరసన వ్యక్తం చేశా రని, అదే వాళ్ల నాయకుడు అదే నల్లబ్యాడ్జీతో అసెంబ్లీకి రావాలని సవాల్​ విసిరారు. 

గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని మంగళవారం అసెంబ్లీలో ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభకు రాకుండా కేసీఆర్​ ఫాంహౌస్​లో పడుకుంటున్నారని, అక్కడే ఉండిపోకుండా అసెంబ్లీకి రావాలని ఆ పార్టీ నేతలైనా చెప్పాలన్నారు. కేసీఆర్​ ఇలాగే ఉంటే.. బీఆర్​ఎస్​కు​ భవిష్యత్​ ఉండదన్నారు.