
హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఓ జోకర్ అని విప్ బీర్ల అయిలయ్య ధ్వజమెత్తారు. సోమవారం తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతల గుండెల్లో దడ మొదలైందన్నారు. మంగళవారం సీఎల్పీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి మీడియా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు జగదీశ్ రెడ్డికి లేదన్నారు. ఆయన జడ్పీటీసీకి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని ఎద్దేవా చేశారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు నూకలు చెల్లాయని అయిలయ్య అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. పేదలకు రేషన్ కార్డులు అందించే కార్యక్రమం విజయవంతం కావడంతో జగదీశ్ రెడ్డిలో ఆందోళన మొదలైందన్నారు.
జగదీశ్‌రెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, సూర్యాపేట నుంచి మళ్లీ ఆయన గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ చేశారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ను జనం మరిచిపోయారని, అందుకే ఉనికి కోసం జగదీశ్ రెడ్డి ఏదో ఒకటి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్కారం ఉన్న వాళ్లు ఎవరూ జగదీశ్ రెడ్డిలా మాట్లాడరని, సూర్యాపేటలో బీజేపీతో లాలూచీ పడడం వల్లే జగదీశ్ రెడ్డి మూడుసార్లు గెలిచాడని ఆరోపించారు.