- కేటీఆర్ పై విప్ బీర్ల అయిలయ్య ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గమైన చర్య అని, అయినా ఇంకా తానేదో ఘనకార్యం చేసినట్లు కేటీఆర్ మాట్లాడడం ఏందని విప్ బీర్ల అయిలయ్య ఫైర్ అయ్యారు. శుక్రవారం సీఎల్పీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం ఎంతటి నీచానికైనా పాల్పడుతామని కల్వకుంట్ల కుటుంబం నిరూపించిందని విమర్శించారు. ఎవరిని ఎంక్వయిరీ చేయాలనేది సిట్ పరిధిలోని అంశమని చెప్పారు.
సిట్ విచారణలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని పేర్కొన్నారు. హరీశ్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం వల్లే గతంలో ఆయనకు మంత్రిపదవి ఇవ్వలేదని, ఈటల రాజేందర్ భార్య ఫోన్ ను ట్యాప్ చేసి ఈటలను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు.
కేటీఆర్ నీచానికి పరాకాష్ట: వేముల వీరేశం
కేటీఆర్ నీచమైన పనికి ఫోన్ ట్యాపింగ్ పరాకాష్ట అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ తో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, అమరుల త్యాగాలను అవమానించారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. భార్యభర్తలు, హైకోర్టు న్యాయమూర్తులు, సివిల్ సర్వీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇలా ఎవరి ఫోన్లనూ వదలలేదని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ తో దేశం సిగ్గుపడేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని విమర్శించారు.
సిట్ అధికారులను బెదిరిస్తున్నడు: అద్దంకి దయాకర్
సిట్ అధికారులను, పోలీసు అధికారులను కేటీఆర్ బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. శుక్రవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ సీఎం కాకపోతే కేటీఆర్ అడ్రస్ ఎక్కడిదన్నారు. కృతజ్ఞతలేని బతుకులు కల్వకుంట్ల కుటుంబానివి అని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు సపోర్టుగా నిలిచేందుకు ఏ ఒక్క నాయకుడూ ఇప్పుడు సిద్ధంగా లేరన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన దొంగలను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని వ్యాఖ్యానించారు.
అడ్డగోలుగా అధికార దుర్వినియోగం: బల్మూరి
బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ వంటి నీచమైన పనులకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. శుక్రవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. పోలీసులే ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పి, ఈ కేసు నుంచి కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారని కేటీఆర్, హరీశ్ పై మండిపడ్డారు. ఈ ఇద్దరు నేతలు అధికారులను భయపెట్టేలా మాట్లాడుతున్నారని, అందుకే వారిపై కేసులు పెట్టాలనిడీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చామని చెప్పారు.
