ఎమ్మెల్సీ రేసులో ఛాన్స్ ఎవరికి?

ఎమ్మెల్సీ రేసులో ఛాన్స్ ఎవరికి?
  • ఎమ్మెల్యే కోటా నుంచి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ
  • కడియం, గుత్తా, చారికి అవకాశం
  • చాలామందికి ‘ఎమ్మెల్సీ’ హామీలిచ్చిన కేసీఆర్
  • గవర్నర్ కోటా నుంచి మరో కోటాకు కౌశిక్​
  • 15న లిస్టు ఖరారు చేయనున్న సీఎం

హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్ బై పోల్ ముగిసీ ముగియగానే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్​ షురువైంది. ఆరు ఎమ్మెల్యేల కోటా స్థానాలకు నోటిఫికేషన్, లోకల్ బాడీస్​  కోటాలో రాబోతున్న 12 ఖాళీలకు షెడ్యూల్ మంగళవారం విడుదలయ్యాయి. దాంతో ఈ 18 ఎమ్మెల్సీ సీట్లు ఎవరిని వరిస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి ఎమ్మెల్యే కోటాలోని ఆరు సీట్లూ టీఆర్ఎస్ గెలుచుకోవడం లాంఛనమే. కానీ ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఎమ్మెల్సీ చేస్తానని అధినేత కేసీఆర్ ఇప్పటికే పలువురికి ప్రామిస్​ చేయడంతో అదృష్టం ఎవరిని వరిస్తుందోనని నేతల్లో టెన్షన్ పీక్స్ కు చేరుతోంది. ఇక లోకల్ బాడీస్​ కోటాలో  ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఓట్లు కీలకం. దాంతో ఆ కోటాలో బరిలో దిగే అభ్యర్థులు చెమటోడ్చక తప్పదు. ప్రత్యర్థులు బలంగా ఉన్నచోట ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకునే అభ్యర్థిత్వాలు ఖరారవుతాయని టీఆర్ఎస్ ​నేతలంటున్నారు. ఎమ్మెల్యే కోటా నామినేషన్లకు తుది గడువుకు ఒక రోజు ముందు 15వ తేదీన ఏకాదశి వస్తోంది. అది మంచి ముహుర్తమనే భావనతో అదే రోజున అభ్యర్థులను కేసీఆర్​ప్రకటిస్తారని చెబుతున్నారు. ఆ రోజే నామినేషన్లు కూడా వేయిస్తారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.
సీఎం హామీ ఇచ్చినోళ్లలో టెన్షన్
రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా చాన్సిస్తానని 2018 అసెంబ్లీ, 2019 లోక్‌‌సభ ఎన్నికలప్పుడు పలువురికి కేసీఆర్‌‌‌‌ హామీ ఇచ్చారు. చట్టసభల్లో ఇప్పటిదాకా అడుగుపెట్టని ఎంబీసీలకు కూడా చాన్సిస్తామన్నారు. చేనేతలు, విశ్వబ్రాహ్మణులనూ మండలికి పంపుతామన్నారు. టీఆర్ఎస్ కోదాడ ఇన్‌‌‌‌చార్జి శశిధర్‌‌‌‌ రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన మోత్కుపల్లి, ఉమా మాధవరెడ్డిలనూ ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ చాన్సివ్వాలని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, పదవీకాలం పూర్తయిన నేతి విద్యాసాగర్‌‌‌‌ కోరుతున్నారు. ఇక ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి, సత్తుపల్లి సెగ్మెంట్ కు చెందిన మట్టా దయానంద్‌‌‌‌, దిండిగాల రాజేందర్‌‌‌‌కు ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. జిల్లా నుంచి పాయం వెంకటేశ్వర్లు, వ్యాపారవేత్తలు రాజేంద్రప్రసాద్‌‌‌‌, వద్దిరాజు రవిచంద్ర కూడా రేసులో ఉన్నారు. ఇక్కడి నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అయిన బాలసాని లక్ష్మీనారాయణ మరోసారి చాన్స్‌‌‌‌ కోరుతున్నారు. మెదక్‌‌‌‌ నుంచి మండలి ప్రొటెం చైర్మన్‌‌‌‌ భూపాల్‌‌‌‌రెడ్డి పదవీకాలం ముగుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఫరీదుద్దీన్‌‌‌‌ టర్మ్ పూర్తయింది. ఎర్రోళ్ల శ్రీనివాస్‌‌‌‌, గ్యాదరి బాలమల్లుకు కూడా పదవిస్తానని సీఎం మాటిచ్చారు. రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మేయర్లు బొంతు రామ్మోహన్‌‌‌‌, తీగల కృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్‌‌‌‌కూ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీలు పట్నం నరేందర్‌‌‌‌ రెడ్డి, శంభీపూర్‌‌‌‌ రాజు మరో చాన్స్ కోరుతున్నారు. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, శాట్స్‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌ వెంకటేశ్వర్‌‌‌‌ రెడ్డికీ సీఎం హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ దామోదర్‌‌‌‌ రెడ్డితో పాటు గట్టు తిమ్మప్ప, విఠల్‌‌‌‌రావు ఆర్య కూడా రేసులో ఉన్నారు. కరీంనగర్‌‌‌‌ నుంచి ఎల్‌‌‌‌ రమణ, కౌశిక్‌‌‌‌ రెడ్డి, పెద్దిరెడ్డితో పాటు రావుల శ్రావణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎల్పీ సెక్రటరీ రమేశ్‌‌‌‌ రెడ్డి, ఆదిలాబాద్‌‌‌‌ నుంచి మాజీ ఎంపీ గోడం నగేశ్‌‌‌‌, శ్రీహరిరావు, సత్యనారాయణగౌడ్‌‌‌‌, వరంగల్‌‌‌‌ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్‌‌‌‌, ఎర్రబెల్లి ప్రదీప్‌‌‌‌రావు, గుడిమల్ల రవికుమార్‌‌‌‌, నూకల నరేశ్‌‌‌‌ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌ నుంచి అరికెల నర్సారెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌‌‌‌రావులను మండలికి పంపుతానని సీఎం హామీ ఇచ్చారు. మాజీ మంత్రి చందూలాల్‌‌‌‌ కుమారుడు ప్రహ్లాద్‌‌‌‌, అరిగెల నాగేశ్వర్‌‌‌‌రావు, లోక భూమారెడ్డి, తుల శ్రీనివాస్‌‌‌‌, మైనార్టీ నాయకులు అలీం, ముజీబ్‌‌‌‌తో పాటు మంత్రి ప్రశాంత్‌‌‌‌ రెడ్డి సోదరుడు అజయ్‌‌‌‌ రెడ్డి కూడా రేసులో ఉన్నారు.

కౌశిక్​రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో?
కౌశిక్​రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇప్పటికే సిఫార్సు చేసినా అది ఆమోదం పొందకపోవడం తెలిసిందే. ఆయనకు ఎమ్మెల్యే కోటాలో చాన్స్‌‌ ఇచ్చి గవర్నర్​ కోటా కింద మరొకరిని సిఫార్సు చేయాలని కేసీఆర్‌‌‌‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తాజా రాజకీయ, సామాజిక సమీకరణాల్లో ఆయన ఎవరిని ఎంచుకుంటారనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోందని టీఆర్ఎస్ సీనియర్లు అంటున్నారు. ఇటీవల పార్టీలో చేర్చుకున్న మాజీ ఎంపీ ఎల్ రమణ, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డిలకు ఏం పదవులిస్తారా అని ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వీళ్లకు ఖాయమేనా..
ఎమ్మెల్యే కోటాలోని 6 సీట్లలో మాజీ స్పీకర్‌‌ సిరికొండ మధుసూదనాచారి, కౌన్సిల్​ మాజీ చైర్మన్ ​గుత్తా సుఖేందర్ ​రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరికి ఇప్పటికే బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని కౌన్సిల్​ చైర్మన్​ పదవి వరిస్తుందని కూడా సమాచారం. మిగతా మూడు సీట్లలో కేసీఆర్ ​కూతురు కవిత, పాడి కౌశిక్​రెడ్డి, వరంగల్​కు చెందిన తక్కళ్లపల్లి రవీందర్​రావు, నల్గొండలోని నాగార్జునసాగర్​ సెగ్మెంట్​కు చెందిన ఎంసీ కోటిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నుంచి లోకల్​ బాడీస్​ కోటాలో ఎమ్మెల్సీగా గెలిచిన కవిత పదవీ కాలం జనవరిలో ముగుస్తోంది. అక్కడ మరొకరికి చాన్సిచ్చి కవితను ఎమ్మెల్యే కోటా నుంచి ఏకగ్రీవం చేయించుకుంటారని టీఆర్ఎస్ నేతలే అంటున్నారు. అదే జిల్లా నుంచి ఆకుల లలిత కూడా రేసులో ఉన్నారు.  కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని సాగర్​ బై ఎలక్షన్​ టైమ్‌‌లో కేసీఆరే ప్రకటించారు. సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌‌కూ చాన్స్‌‌ ఇవ్వొచ్చంటున్నారు.