విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్-సీలో భాగంగా శుక్రవారం (డిసెంబర్ 26) జైపూర్ వేదికగా ముంబై, ఉత్తరాఖాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. సిక్కింపై సెంచరీతో చెలరేగిన హిట్ మ్యాన్ ఉత్తరఖాండ్పై డకౌటై తీవ్రంగా నిరాశపర్చారు. మ్యాచ్ తొలి ఓవర్‌లోనే ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు.
ఉత్తరఖాండ్ బౌలర్ దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్‌లో జగ్‌మోహన్ నాగర్‌కోటికి క్యాచ్ ఇచ్చి రోహిత్(0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో అతడి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురి కాగా.. భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను గోల్డెన్ డకౌట్ చేసిన దేవేంద్ర సింగ్ బోరా క్రికెట్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. రోహిత్ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ ప్రేమికులు అసలు ఎవరీ దేవేంద్ర సింగ్ బోరా అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఎవరీ బోరా..?
25 ఏళ్ల దేవేంద్ర సింగ్ బోరా ఉత్తరఖాండ్‌కు చెందిన రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో పాటు కొత్త బంతితో స్వింగ్ రాబట్టగలడు. ముంబైతో జరిగిన మ్యాచ్ బోరాకు తన కెరీర్‌లో మూడో లిస్ట్ ఎ మ్యాచ్. మూడో మ్యాచులోనే ఏకంగా ప్రపంచ దిగ్గజ బ్యాటర్లలో ఒకడిగా పేరుపొందిన రోహిత్ శర్మను గోల్డెన్ డకౌట్ చేసి టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. తన తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మను ఔట్ చేయడం ద్వారా దేవేంద్ర సింగ్ బోరా ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపుకానుంది.
ఇప్పటి వరకు మూడు లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన ఈ యంగ్ సంచలనం 19.5 యావరేజ్, 20.2 స్ట్రైక్‌రేట్‌తో వికెట్లు సాధించాడు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో (4/44) అద్భుతమైన గణాంకాలతో విజయ్ హజారే ట్రోఫీని ఘనంగా ప్రారంభించాడు. సెకండ్ మ్యాచులో ఏకంగా రోహిత్ శర్మనే ఔట్ చేసి ఔరా అనిపించాడు. ఇక.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 41.13 యావరేజ్‌తో 30 వికెట్లు పడగొట్టాడు. అలాగే.. ఉత్తరఖాండ్ ప్రీమియర్ లీగ్‌లో 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు సాధించాడు. రోహిత్‌ను డకౌట్ చేయడంతో ఈ దేశవాళీ పేసర్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
