ఎవరీ వెంకట్.. అప్పుడు వ్యభిచారం.. ఇప్పుడు డ్రగ్స్.. సినీ ఇండస్ట్రీ దందాతో కోట్లు సంపాదించాడా..?

ఎవరీ వెంకట్.. అప్పుడు వ్యభిచారం.. ఇప్పుడు డ్రగ్స్.. సినీ ఇండస్ట్రీ దందాతో కోట్లు సంపాదించాడా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి పెద్ద డ్రగ్స్ రాకెట్ బట్టబయలు అయ్యింది. సినీ నిర్మాత, ఫైనాన్షియర్ వెంకట్ పై నిఘా పెట్టిన నార్కోటిక్ అధికారులు.. మూడు నెలల రెక్కీ తర్వాత అడ్డంగా బుక్ చేశారు. నిర్మాతగా.. సినిమాలకు ఫైనాన్షియర్ గా గుర్తింపు పొందిన వెంకట్.. డ్రగ్స్ దందాతో కోట్ల రూపాయలు సంపాదించాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అక్కినేని నాగచైతన్య సినిమా ఆటోనగర్ సూర్య సినిమాతోపాటు అక్కినేని నాగార్జున నటించిన ఢమరుకం సినిమాకు నిర్మాత, ఫైనాన్షియర్ గా ఉన్నారు వెంకట్. అంతేనా.. పూలరంగడు, లవ్లీ సినిమాలకు సైతం డబ్బు పెట్టింది ఈ వెంకట్ కావటం విశేషం. 

హైటెక్ సిటీ ఏరియాలో ఖరీదైన అపార్ట్ మెంట్స్ లో సర్వీస్ ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్న వెంకట్.. అక్కడి నుంచే తన డ్రగ్స్ దందాను కొనసాగించినట్లు ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు డ్రగ్స్ కేసులో దొరికిన సినీ నిర్మాత, ఫైనాన్షియర్ వెంకట్ పై గతంలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న కేసు నమోదై ఉండటం. అంటే ఈ వెంకట్ చీకటి వ్యవహారాలు కొత్తగా వెలుగులోకి రాలేదు.. ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ కేసులో దొరికాడు అనేది ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యింది. 

సినీ ఇండస్ట్రీ నిర్మాత, ఫైనాన్షియర్ అంటే పెద్ద ఎత్తున పరిచయాలు ఉంటాయి. అంతే కాకుండా అవకాశాల కోసం ఎదురుచూసే ఎంతో మంది అమ్మాయిలతోనూ పరిచయాలు ఉండే ఉంటాయి. వాళ్ల బలహీనతను అవకాశంగా తీసుకుని వ్యభిచార గృహాలతోపాటు డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలోని బలాలు, బలహీనతలపై బాగా అవగాహన ఉన్న వెంకట్.. దాన్నే అవకాశంగా తీసుకుని ఈ డ్రగ్స్ దందా చేస్తున్నాడనే అతను ఇస్తున్న రేవ్ పార్టీలే సాక్ష్యంగా కనిపిస్తుంది. మూడు నెలలు రెక్కీ నిర్వహించి మరీ పట్టుకున్నారంటే.. వెంకట్ నెట్ వర్క్ ఎంత పెద్దదో అర్థం అవుతుంది. 

వెంకట్ తన నెట్ వర్క్ లో భాగంగా బాలాజీ రైట్ హ్యాండ్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనూ వెంకట్ తోపాటు వ్యభిచార కేసులో దొరికింది కూడా బాలాజీనే. వెంకట్ డ్రగ్స్ దందా సినీ ఇండస్ట్రీలో ఎంత వరకు విస్తరించింది.. డ్రగ్స్ కస్టమర్లు ఎవరు.. ఎంత మొత్తం గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాడు.. ఎంత సప్లయ్ చేశాడు.. ఎంత మొత్తానికి అమ్ముతున్నాడు.. సరఫరా ఎలా చేస్తున్నాడు.. ఇలాంటి చీకటి కోణాలు విచారణలో బయటకు రావాల్సి ఉంది. 

సినీ నిర్మాతగా.. ఫైనాన్షియర్ గా సినీ ఇండస్ట్రీలోనే ఓ పెద్ద స్థాయిలోనే ఉన్న వెంకట్ డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో అతని నెట్ వర్క్ విస్తరణ ఏ స్థాయిలో ఉందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కోట్లకు కోట్లు సినిమాలకు ఫైనాన్స్ చేసే వెంకట్ అసలు వ్యాపారం డ్రగ్స్, వ్యభిచారమేనా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ రకంగానే అతను సంపాదించాడా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే వెంకట్ ఫైనాన్స్, నిర్మాతగా వ్యవహరించిన సినిమాలన్నీ కోట్లకు కోట్లు లాభాలు ఏమీ తీసుకురాలేదు కదా.. బ్లాక్ బస్టర్ సినిమాలు కాదు కదా..