తనకు చాలెంజ్ చేయడానికి ఆయనెవరు ..?

తనకు చాలెంజ్ చేయడానికి ఆయనెవరు ..?

సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బెదిరిస్తే వైఎస్సార్ బిడ్డ భయపడదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్  చనిపోయిన రోజు కుటుంబ సభ్యులు రాజకీయాలు మాట్లాడారన్న జగ్గారెడ్డి కామెంట్లను ఆమె ఖండించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గం జిన్నారంలో షర్మిల పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఆనాడు తమ కుటుంబం పడిన బాధ తమకే తెలుసన్నారు. వైఎస్ చనిపోయిన రోజు తాము బతుకుతామా? చస్తామా? అన్నట్లుగా బాధపడ్డామని చెప్పారు. జగ్గారెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. తనను చాలెంజ్ చేయడానికి జగ్గారెడ్డి ఎవరు అని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను ఎవరికీ భయపడబోనని అన్నారు. పాలమూరు ఎమ్మెల్యేలంతా కలిసి అసెంబ్లీ స్పీకర్​కు ఫిర్యాదు చేసినా భయపడలేదని గుర్తుచేశారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సంకెళ్లు చూపించి మరీ తాను సవాల్ చేశానని తెలిపారు.  

నోటిఫికేషన్లు ఆపేందుకే ఎస్టీ రిజర్వేషన్ల జీవో

ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపేందుకే సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశం తెరమీదికి తెస్తున్నారని వైఎస్సార్ టీపీ చీఫ్  షర్మిల ఆరోపించారు. నిజంగా గిరిజనుల మీద ప్రేమే ఉంటే వాళ్లకు ఇన్నాళ్లుగా 10 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. జాబ్ నోటిఫికేషన్లను ఆపడానికే గిరిజన రిజర్వేషన్ జీవోను కేసీఆర్ ఎత్తుగడగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. జీవో ఇచ్చాక ఎవరోఒకరు కోర్టుకు వెళ్తారని, ఆ కారణంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపొచ్చన్నదే కేసీఆర్​ఉద్దేశమని అన్నారు. కేసీఆర్ చేసేవన్నీ మోసాలేనని ఆరోపించారు. దళిత బంధు పథకంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లబ్ధిదారులతో మాట్లాడిన తీరుపై షర్మిల ఫైర్ అయ్యారు. లబ్ధిదారులను కించపరిచేలా మంత్రులే బహిరంగంగా మాట్లాడుతున్నారని, దళిత బంధు పంపిణీ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు, ఆర్డీవోలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.