Sachin Dhas: భారత క్రికెట్‌లో సచిన్ దాస్ నామస్మరణ.. ఎవరీ యువ క్రికెటర్..?

Sachin Dhas: భారత క్రికెట్‌లో సచిన్ దాస్ నామస్మరణ.. ఎవరీ యువ క్రికెటర్..?

అండర్-19 ప్రపంచ కప్ 2024లో భార‌త జట్టు ఫైనల్‌‌లో అడుగుపెట్టింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ పోరులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. వరుసగా ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 245 పరుగుల ఛేదనలో 32 రన్స్ కే 4 వికెట్లు కోల్పయినప్పటికీ.. లక్ష్యాన్ని చేధించింది. తీవ్ర ఒత్తిడిలోనూ యువ క్రికెటర్లు అపార అనుభవాన్ని ప్రదర్శించారు.

ఐదో వికెట్ కు భారత అండర్ -19 జట్టు కెప్టెన్ ఉదయ్ సహారన్(124 బంతుల్లో 81), సచిన్ దాస్ (95 బంతుల్లో 96) 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ విజయంతో దాస్ పేరు మార్మోగుతోంది. 4 ప‌రుగుల‌తో సెంచ‌రీ చేజార్చుకున్నా..  అతను తన దూకుడుతో స‌ఫారీ బౌల‌ర్లను  ఆటాడుకున్నాడు. త‌న సంచ‌ల‌న ఆట‌తో శభాష్ అనిపించుకున్నాడు. దీంతో ఏవరీ క్రికెటర్..? అతని కుటుంబ నేపథ్యం ఏంటని అతని గురుంచి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.    

ముంబై కుర్రాడు

సచిన్ దాస్.. 2005 ఫిబ్రవ‌రి 3న మ‌హారాష్ట్రలోని బీడ్ గ్రామంలో జ‌న్మించాడు. తండ్రి పేరు సంజ‌య్ దాస్. ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. తల్లి పేరు..సురేఖ దాస్. మహారాష్ట్ర పోలీస్‌ విభాగంలో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్. ఆమె జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. పేరు.. ప్రతీక్ష. పూణెలో యుఎస్‌పిసి పరీక్షలకు సిద్ధమవుతోంది. సంజయ్ దాస్ యూనివర్సిటీ స్థాయిలో క్రికెటర్.  ఆయన దాస్ పుట్టకముందే క్రికెటర్‌గా మార్చాలని అనుకున్నారట. 

ఆ మక్కువతో ఆయన త‌న కుమారుడికి భారత క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్కర్ పేరు క‌లిసేలా..  'స‌చిన్ దాస్' అని పేరు పెట్టాడు. నాలుగున్నర ఏండ్ల వయసు నుంచే స‌చిన్ క్రికెట్ ఆడ‌డం మొద‌లెట్టాడు. అండ‌ర్ -14, అండ‌ర్ -16, అండ‌ర్ -19 విభాగాల్లో ముంబై జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్యవ‌హ‌రించాడు. అలా భారత యువ జట్టుకు ఎంపికై తన సంచలన ఆటతో వార్తల్లో నిలిచాడు.  

ALSO READ :- క్రికెట్ చరిత్రలో తొలిసారి.. మూడు ఫార్మాట్ లలో నెంబర్.1 బౌలర్‌గా బుమ్రా

32 పరుగులకే 4 వికెట్లు

ద‌క్షిణాఫ్రికా నిర్దేశించిన 244 ప‌ర‌గుల ఛేద‌న‌లో భార‌త్ ఆదిలోనే క‌ష్టాల్లో ప‌డింది. 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్లు ఆద‌ర్శ్ సింగ్(0), అర్శిన్ కుల‌క‌ర్ణి(12)లు, ముషీర్ ఖాన్‌(4) త‌క్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. ఆ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన స‌చిన్.. ఉదయ్ సహారన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. సెంచరీకి 4 పరుగుల దూరంలో దాస్ ఔటయ్యాడు. అనంతరం స‌హ‌ర‌న్ ఒత్తిడికి లోన‌వ్వకుండా టెయిలెండ‌ర్లతో క‌లిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. స‌చిన్ దాస్.. ఇప్పటివ‌ర‌కూ ఈ టోర్నీలో 6 మ్యాచుల్లో 73.50 స‌గ‌టుతో 294 పరుగులు చేశాడు.