విద్యా శాఖ మంత్రి ఎవరు?.. కన్ఫ్యూజన్ లో అధికారులు

విద్యా శాఖ మంత్రి ఎవరు?.. కన్ఫ్యూజన్ లో అధికారులు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? అని అడిగితే ఏం చెప్తారు. హోంమంత్రి అడిగితే కష్టంగానీ విద్యామంత్రి తెలీదా అంటారు. బయటి వాళ్లకు మంత్రి ఎవరో కాస్త క్లారిటీ ఉన్నా.. విద్యాశాఖ అధికారులు మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నారంట. అసలు మంత్రి కంటే ఎవరెవరో వచ్చి శాఖలో వేళ్లుపెట్టడం వల్లే ఈ గందరగోళం వచ్చిందనే చర్చ జరుగుతోంది. సంబంధం లేనివాళ్లు రివ్యూలు చేసి ఆదేశాలు ఇస్తుంటే ఇంతకీ మంత్రి ఎవరన్న డౌట్ అధికారులకే వస్తోందని చెబుతున్నారు. అసలు ఎవరి మాటను తాము ఫాలో కావాలో అర్థం కావట్లేదంటున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో పనుల కంటే రివ్యూలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే విచిత్రంగా విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉండగా పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పదేపదే రివ్యూలు చేస్తున్నారట. స్కీం మొదలు పెట్టినప్పటి నుంచి విద్యామంత్రి కంటే సిటీ మంత్రే ఎక్కువ రివ్యూలు చేశారని చెప్పుకుంటున్నారు. ఈ స్కీంకు సర్కారు ఇచ్చే నిధుల కంటే సిటీ మంత్రి ఇచ్చే ఆదేశాలే ఎక్కువగా ఉన్నాయని కొందరు విద్యాశాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. 

తలసాని రివ్యూ చేశాక ఇదే స్కీంపై విద్యామంత్రి కూడా రివ్యూ చేస్తున్నారట. పదేపదే రివ్యూలు చేయడం, ఇద్దరు వేర్వేరుగా ఆదేశాలిస్తుండడంతో ఎవరికి ఫాలో అవ్వాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఇద్దరి మధ్య మేం నలిగిపోతున్నామని సన్నిహితులతో చెప్పకుంటున్నారు. అసలే స్కీంకి ఫండ్స్ ఇచ్చేది తక్కువ, దీంతో ఎవర్ని ఫాలో అయితే ఇంకెవరితో తిట్లు పడతాయోనని భయపడుతున్నారట. 

కొంతకాలం కింద రంగారెడ్డి జెడ్పి అఫీస్ లో సడెన్ గా మంత్రి తలసాని మీటింగ్ పెట్టారు. ఇది తెలియడంతో వెంటనే మంత్రి సబితా కూడా మరో మీటింగ్ పెట్టారు. మన బడి నిధుల కేటాయింపుపై మంత్రి తలసాని ఆదేశాలిచ్చినట్లు కొందరు అధికారులు మంత్రి సబితకు చెప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కూడా పరిస్థితి మారిందేం లేదంటున్నారు.