ఏఐ కంపెనీ సీఈవో కిరాతకం.. కొడుకును చంపేసింది

ఏఐ కంపెనీ సీఈవో కిరాతకం..  కొడుకును చంపేసింది
  • నాలుగేండ్ల కుమారుడిని ఊపిరాడకుండా చేసి హత్య
  • బాడీని బ్యాగులో దాచి గోవా నుంచి 
  • బెంగళూర్​కు తీసుకెళ్తుండగా అరెస్టు 
  • రూమ్​లో రక్తపు మరకలతో బయటపడ్డ నేరం 
  • భర్తతో నిందితురాలికి గొడవలు.. కొడుకును 
  • భర్త కలవొద్దని గోవాకు తీసుకెళ్లి ఘోరం 

పణజి: బెంగళూర్ కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీ సీఈవో సుచనా సేత్ దారుణానికి ఒడిగట్టింది. ఆమె తన నాలుగేండ్ల కొడుకును గోవాలో కిరాతకంగా హత్య చేసింది. ఊపిరాడకుండా చేసి కుమారుడిని చంపేసి, ఎవరికీ అనుమానం రాకుండా డెడ్ బాడీని బ్యాగులో ప్యాక్ చేసింది. 


ఏమీ ఎరుగనట్టు ఆ బ్యాగ్ తీసుకుని ట్యాక్సీలో బెంగళూర్​కు బయలుదేరింది. అయితే ఆమె గోవాలో స్టే చేసిన రూమ్​లో రక్తపు మరకలే ఆమెను పట్టిచ్చాయి. వాటిని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నేరం బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు  బెంగళూర్ కు చేరుకోకముందే సుచనా సేత్​ను పట్టుకున్నారు. భర్తతో గొడవల కారణంగానే కొడుకును సుచన హత్య చేసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొడుకును చూసేందుకు భర్త వస్తున్నాడని తెలిసి, ఆయనను కలవకుండా చేయాలని గోవా టూర్​కు ప్లాన్ చేసిందని భావిస్తున్నారు. కాగా, కొడుకును చంపిన తర్వాత సుచన ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు తెలిపారు.  

ట్యాక్సీలో బెంగళూర్​కు.. 

బెంగళూర్​కు చెందిన సుచనా సేత్.. మైండ్ ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ‘100 బ్రిలియంట్ వుమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్ ఫర్ 2021’ జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. సుచన తన నాలుగేండ్ల కొడుకుతో ఈ నెల 6న గోవా టూర్ కు వెళ్లారు. నార్త్ గోవాలోని కండోలిమ్ లో రెంటెడ్ అపార్ట్ మెంట్​లో రూమ్ తీసుకున్నారు. రెండ్రోజులు ఉన్నాక.. బెంగళూర్​ వెళ్లేందుకు  ట్యాక్సీ అరెంజ్ చేయాలని అపార్ట్ మెంట్ సిబ్బందిని కోరారు. వాళ్లు ఏర్పాటుచేసిన ట్యాక్సీలో  సోమవారం తెల్లవారుజామున సుచన బెంగళూర్​కు బయలుదేరారు. 

రూమ్​లో రక్తపు మరకలు.. 

సుచన రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోవడంతో, దాన్ని క్లీన్ చేసేందుకు అపార్ట్ మెంట్ సిబ్బంది వెళ్లారు. అక్కడ టవల్​పై రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్ కు వచ్చి పరిశీలించారు. ‘‘సుచన తన కొడుకుతో కలిసి ఇక్కడికి వచ్చింది. కానీ తిరిగి వెళ్లేటప్పుడు పిల్లాడు లేడు. ఆమె వెళ్లేటప్పుడు ఓ పెద్ద బ్యాగును తీసుకెళ్లింది” అని పోలీసులకు సిబ్బంది చెప్పారు. దీంతో కొడుకును చంపి, బ్యాగులో బాడీని తీసుకెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. వెంటనే సుచనకు ఫోన్ చేసి.. ‘‘రూమ్​లో రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయి? మీ బాబు ఎక్కడ ఉన్నాడు” అని ప్రశ్నించారు. దానికి సుచన బదులిస్తూ.. ‘‘నాకు మంత్లీ పీరియడ్స్ వచ్చాయి. టవల్ పైనున్న రక్తపు మరకలు అవ్వే. నా కొడుకు సౌత్ గోవా మార్గోవో టౌన్​లో నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాడు” అని చెప్పింది. ఆమె చెప్పిన అడ్రస్​లో ఎంక్వైరీ చేయగా, అది ఫేక్ అడ్రస్ అని తేలింది. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. వెంటనే ట్యాక్సీ డ్రైవర్​కు ఫోన్ చేసిన పోలీసులు.. అనుమానం రాకుండా సుచనను దగ్గర్లోని పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో డ్రైవర్ పక్కనే ఉన్న చిత్రదుర్గ (కర్నాటక) స్టేషన్​కు కారును తీసుకెళ్లాడు. లోకల్ పోలీసులు సుచన దగ్గరున్న బ్యాగును చెక్ చేయగా, అందులో పిల్లాడి మృతదేహం దొరికింది. ఆమెను అదుపులోకి తీసుకుని గోవా పోలీసులకు అప్పగించారు. గోవా పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా, సుచనను 6 రోజుల కస్టడీకి అప్పగించింది.

భర్తతో గొడవలు..  

సుచన, ఆమె భర్త వేర్వేరుగా ఉంటున్నారని.. వాళ్ల విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని నార్త్ గోవా ఎస్పీ నిధిన్ వాల్సన్ తెలిపారు. ‘‘సుచన సొంతూరు బెంగాల్. బెంగళూర్​లో ఉంటోంది. ఆమె భర్త వెంకటరమణది కేరళ. ఆయన ప్రస్తుతం ఇండోనేసియాలోని జకర్తాలో ఉన్నారు. ఈ ఘటన గురించి అతనికి సమాచారం అందించాం” అని చెప్పారు. వెంకటరమణ కర్నాటకకు వచ్చారని, పోస్టుమార్టం తర్వాత కొడుకు డెడ్ బాడీని ఆయనకు అప్పగించామని పేర్కొన్నారు. ‘‘సుచన తన కొడుకును ఎందుకు చంపిందో ఇంకా తెలియలేదు. ఆమెను విచారించాకే అన్ని విషయాలు తెలుస్తాయి. కొడుకును చంపిన తర్వాత సుచన ఆత్మహత్యాయత్నం చేసింది. ఎడమచేతి మణికట్టు దగ్గర కోసుకుంది. రూమ్​లో టవల్ పైనున్న రక్తపు మరకలు అవే” అని వివరించారు.