కూలిన యుద్ధ విమానం.. పాక్ దా? మనదా?

కూలిన యుద్ధ విమానం.. పాక్ దా? మనదా?

బుద్గాం: జమ్ము కశ్మీర్ సరిహద్దులోని బుద్గాం జిల్లాలో గారెండ్ కలాన్ గ్రామంలో ఓ యుద్ధ విమానం కూలిపోయింది. ఇద్దరు పైలెట్లు మరణించారు. ఇంత వరకు ఓకే.. కానీ కూలిన యుద్ధ విమానం భారత్ వాయుసేనదా? లేక పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని మన బలగాలు కూల్చేశాయా? ఇదే క్లారిటీ రావాలి.

పాక్ పన్నాగం భగ్నం.. ఆ దేశ యుద్ధ విమానాల కూల్చివేత

పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశాయి. వెంటనే అప్రమత్తమైన మన వాయుసేన వాటిపై దాడికి దిగాయి. సరిహద్దు దాటి వెనక్కి వెళ్లే లోపే ఒక పాక్ యుద్ధ విమానాన్ని మన వాయుసేన కూల్చేసింది. నిన్న పాక్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై ఐఏఎఫ్ దాడి చేసి 300 మంది ముష్కరులను అంతం చేసింది. దీనికి ప్రతిగా పాక్ దాడికి దిగింది. భారత పౌరులు, బలగాలు లక్ష్యంగా దాడికి చేయడంతో దాయాది దేశ యుద్ధ విమానాలను భారత్ కూల్చేసిందని వార్తలొస్తున్నాయి.

భారత్ పై స్ట్రైక్ చేశాం: పాక్

పాకిస్థాన్ మాత్రం తామే భారత్ పై స్ట్రైక్ చేశామని ప్రకటించుకుంది. పాక్ గగనతలం నుంచే నియంత్రణ రేఖ వెంట దాడి చేశామని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ తెలిపారు. తమ దేశాన్ని రక్షించుకునే సత్తా ఉందని చెప్పేందుకు ఈ దాడి చేశామని చెప్పారు. ఉద్రిక్తతలు పెంచడం తమ ఉద్దేశం కాదన్నారు. అయితే తమ బలగాలు పూర్తి సన్నద్ధతతో ఉన్నాయని అన్నారు. పాక్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ అయితే ఏకంగా రెండు భారత వాయుసేన యుద్ధ విమానాలను కూల్చామని చెప్పారు. ఒకటి పీవోకేలో, మరొకటి భారత్ లో కూలాయని, ఇద్దరు పైలట్లను అరెస్టు చేశామని  అన్నారు.

ఎవరిదో తేల్చేపనిలో ఉన్నాం

భారత ఆర్మీ మాత్రం దీనిపై ఆచితూచి స్పందించింది. సరిహద్దులో యుద్ధ విమానం కూలడం నిజమేనని బుద్గాం జిల్లా ఎస్ఎస్పీ చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలను గుర్తించామన్నారు. అయితే ఆ యుద్ధ విమానం ఎవరిదనేది తెలియాల్సి ఉందన్నారు. టెక్నికల్ టీమ్ దీనిపై దర్యాప్తు చేస్తోందని అన్నారు.