ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
సికింద్రాబాద్, వెలుగు: ఎవరెవరికో భారత రత్న ఇస్తున్నారని, ప్రజా గాయకుడు గద్దర్‌కు ఎందుకు ఇవ్వడం లేదని, ఆయన ఎందులో తక్కువ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. సెప్టెంబర్ 25న మునుగోడులో జరిగే కార్యక్రమంలో గద్దర్‌కు గ్లోబల్ పీస్ అంబాసిడర్ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గురువారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో జరిగిన క్రిస్టియన్ ప్రతినిధుల సమావేశానికి కేఏ పాల్, గద్దర్ హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం అగ్రవర్ణాలకు పెద్దపీట వేస్తూ, దళితులను విస్మరించిందని కేఏ పాల్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ దగ్గర సుమారు రూ.9 లక్షల కోట్ల ప్రజాధనం తన ఫామ్‌హౌస్ అండర్ గ్రౌండ్‌లో దాచిపెట్టినట్లు తనకు పక్కా సమాచారం ఉందన్నారు. కాగా, తమ పార్టీ సభ్యత్వం పోయిందని, పార్టీ లేదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమన్నారు.
