రాష్ట్రం కోరితే కాళేశ్వరంపై 48 గంటల్లో సీబీఐ ఎంక్వైరీ: కిషన్ రెడ్డి

రాష్ట్రం కోరితే కాళేశ్వరంపై 48 గంటల్లో సీబీఐ ఎంక్వైరీ: కిషన్ రెడ్డి
  • కాంగ్రెస్​ సర్కార్​ ఎందుకు కోరడం లేదు?: కిషన్​రెడ్డి
  • న్యాయ విచారణ పేరిట కేసీఆర్​కు మేలు చేయాలనుకుంటున్నరు
  • మాజీ సీఎం, ప్రస్తుత సీఎం మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది
  • కాంగ్రెస్​ది తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని విమర్శ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం కోరితే 48 గంటల్లో  సీబీఐతో విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తుందని బీజేపీ స్టేట్​ చీఫ్​, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీకి కోరాలని డిమాండ్​ చేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ పేరుతో కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణలో జరిగిన అనేక అవినీతి, అక్రమాలను ప్రస్తావించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు, ప్రాజెక్టుల్లో స్కామ్​లపై దర్యాప్తు చేపడుతామని పీసీసీ చీఫ్​ హోదాలో రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పారు. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని కూడా పలుమార్లు ప్రస్తావించారు. సీబీఐ విచారణకు కూడా డిమాండ్ చేశారు. కానీ,  ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణను రేవంత్ ఎందుకు కోరడం లేదు? అందులో ఉన్న మతలబు ఏంది?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకే పరిమితమయ్యారని, ప్రాజెక్టు భవిష్యత్తు కోసం ఏం చేయాలో ఆలోచించడం లేదని విమర్శించారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అతిపెద్ద స్కామ్​ కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిపై సీబీఐ దర్యాప్తునకు అంగీకరిస్తారా.. లేదా..? సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయాలనుకుంటున్నారా.. లేదా..? సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి” అని డిమాండ్​చేశారు. 

కాళేశ్వరం పేరిట ప్రజాధనం గోదారిపాలు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు అని, ఇది ఇంజనీరింగ్ మార్వెల్ అని,  కేసీఆర్ అపరభగీరథుడని బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకున్నారని కిషన్​రెడ్డి విమర్శించారు. ‘‘80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. చీఫ్ ఇంజినీర్ అవతారమెత్తి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంగా ఎలా మారింది? మరి ఈ  ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన లక్ష కోట్ల రూపాయలు ఏమయ్యాయి?” అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లైఫ్ లైన్ గా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని, అన్నారం గ్యారేజీకి గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంతో ప్రజా ధనాన్ని గోదావరిపాలు చేసినట్లయిందని మండిపడ్డారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై ఆనాడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖ రాశాం. దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. 2023 అక్టోబర్​ 24న హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ప్రాజెక్టును సందర్శించి జరిగిన నష్టాన్ని, నిర్మాణంలో జరిగిన పొరపాట్ల గురించి ఆరా తీసి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి చర్చించింది.  20 అంశాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరితే తప్పించుకుంది. 11 అంశాలపై మాత్రమే అరకొరగా సమాధానమిచ్చింది” అని అన్నారు. అసమర్థతను, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రాజెక్టు వివరాలను గత బీఆర్ఎస్ సర్కారు గోప్యంగా ఉంచిందని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణకు కాంగ్రెస్​ ప్రభుత్వం ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ‘‘ప్రాజెక్టు విషయంలో విచారణ కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం.. కేసీఆర్ ను అడిగితే సీబీఐ ఎంక్వైరీకి అంగీకరించలేదు. తెలంగాణలో సీబీఐ దర్యాప్తులకు అనుమతి నిరాకరిస్తూ నాడు కేసీఆర్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలనే చిత్తశుద్ధి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా.. లేదా..?” అని కిషన్​రెడ్డి అన్నారు. అవినీతికి, కాంగ్రెస్ పార్టీకి విడదీయలేని బంధం ఉందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ కు సానుభూతి ఉన్నట్లు కనిపిస్తున్నదని దుయ్యబట్టారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్..ఈ రెండింటి డీఎన్ఏ ఒకటే. రెండూ బొమ్మాబొరుసు పార్టీలే. కేసీఆర్ కాంగ్రెస్ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పొత్తులో భాగంగానే ఆనాడు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కేసీఆర్ పనిచేశారు. కాబట్టే .. దగ్గరి మిత్రుల్లా కాంగ్రెస్, బీఆర్ఎస్  తోలుబొమ్మలాట లాడుతున్నాయి” అని విమర్శించారు.  ‘‘ఇల్లు అలకగానే పండుగ కాదు. గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను అమలు చేయాలి” అని ఆయన అన్నారు. 

ఎంపీ అభ్యర్థులెవరనేది హైకమాండే తేలుస్తది

ఎంపీ అభ్యర్థుల ఎంపిక తమ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పెద్దగా సంబంధం ఉండదని బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డి అన్నారు. ‘‘ఈ నెల 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. జాతీయ నేతలు ఇందులో పాల్గొంటారు. లోక్​సభ ఎన్నికల్లో గెలుపుపై ఇందులో చర్చిస్తం. రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థులను హైకమాండ్​ నిర్ణయమే ఫైనల్​. గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది” అని ఆయన మీడియా చిట్​చాట్​లో పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు. లోక్​సభ ఎన్నికల కోసం కమిటీలు వేస్తున్నామని, వాళ్లతో మీటింగ్ ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 28  లోపు లేదా మార్చి మొదటి వారంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ‘‘రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో పోటీకి రెడీ అవుతున్నం. ఎన్డీయేలో జనసేన భాగస్వామ్య పార్టీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీతో పొత్తు ఉండకపోవచ్చు” అని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై కేంద్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ వేసిందని, ఈ నెల 17న ఇదే అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెల్లడించనుందని చెప్పారు. ఆలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేస్తుందని అన్నారు. బీజేపీ శాసన సభా పక్షనేత ఎంపిక ఎప్పుడైనా ఉండొచ్చని, ఢిల్లీ నుంచి అబ్జర్వర్లు వచ్చి దీనిపై నిర్ణయం ప్రకటిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీకి ఉన్న నలుగురు సిట్టింగ్  ఎంపీలకు తిరిగి టికెట్ ఇవ్వడం దాదాపు ఖాయమేనని, అయితే ఇది తన  వ్యక్తిగత అభిప్రాయమం మాత్రమేనని, హైకమాండ్ మాట కాదని చెప్పారు. మంద కృష్ణకు  బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసే అంశం చర్చకు రాలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కొత్త మురిపెంలా ఉందని, పార్లమెంట్ ఎన్నికల కోసమే ప్రజా పాలన  హడావుడి అని విమర్శించారు. అయోధ్య రామమందిర నిర్మాణం వ్యతిరేకించిన వాళ్లను కూడా ఆలయ ప్రారంభోత్సవానికి పిలిచామని కిషన్​రెడ్డి చెప్పారు. ‘‘సీపీఎం నేత సీతారాం ఏచూరి పేరులో సీతా, రామ్ ఇద్దరూ ఉంటారు. కానీ ఆయన మాత్రం రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తరు. అదేమిటో అర్థం కాదు. అయ్యప్ప భక్తులను కేరళ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇది భవిష్యత్తులో అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది. కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేకపోతున్నదని ”అని ఆయన మండిపడ్డారు.

తుమ్మితే పడిపోయే ప్రభుత్వం మీది

బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఎంఐఎం మధ్యవర్తిత్వం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కిషన్​రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, కేసీఆర్ కుటుంబ పాలనపై విరక్తి చెందే.. ప్రజలు కాంగ్రెస్​ను ఎన్నుకున్నారని,  అంతేకాని ఆ పార్టీపై ప్రేమతోనో, రాహుల్ గాంధీపై విశ్వాసంతోనో కాదని అన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే పడిపోయేది. అందుకే.. కేసీఆర్ కు మేలుచేసే విధంగా కాంగ్రెస్  వ్యవహరిస్తున్నది. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం కేసీఆర్.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది” అని ఆరోపించారు.