కేసీఆర్‌‌, కుమారస్వామి కటీఫ్!

కేసీఆర్‌‌, కుమారస్వామి కటీఫ్!
  • కేసీఆర్‌‌, కుమారస్వామి కటీఫ్!
  • కర్నాటక ఎన్నికల్లో సింగిల్‌‌గానే బరిలోకి జేడీఎస్.. సైలెంట్‌‌గా బీఆర్ఎస్‌‌
  • కీలక సమయంలో ఇద్దరి మధ్య గ్యాప్
  • జేడీఎస్‌‌తో కలిసి పోటీ చేయాలని భావించిన కేసీఆర్
  • ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించి షాక్ ఇచ్చిన కుమారస్వామి
  • వెనక్కి తగ్గడమే బెటరని భావించిన బీఆర్ఎస్ అధినేత
  • కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సపోర్ట్ ఎవరికి?
  • అక్కడి తెలుగు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్న రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నేతలు
  • అటువైపు చూడని గులాబీ నేతలు.. మహారాష్ట్రలో సభ ఏర్పాట్లలో బిజీ

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు నుంచి తన వెంట ఉన్న జేడీఎస్ నేత కుమారస్వామిని కీలక సమయంలో సీఎం కేసీఆర్ ఎందుకు వదులుకున్నారు? కర్నాటక అసెంబ్లీ ఎన్నికల టైమ్‌‌లో కలిసికట్టుగా ఉండాల్సిన వీరిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు పెరిగింది? రెండు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్‌‌టాపిక్‌‌గా మారింది. దేశమంతటా పోటీ చేస్తామని పలు మార్లు ప్రకటించిన కేసీఆర్.. తీరా పొరుగు రాష్ట్రంలో​ఎన్నికలొచ్చాక సైలెంట్ అయ్యారు. పైగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీలపై రోజుకో తీరుగా హడావుడి చేస్తున్నారు.

కర్నాటక ఎలక్షన్లపై బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటనేది ఇప్పటి వరకు కేసీఆర్‌‌‌‌ ప్రకటించలేదు. కుమారస్వామిని వదులుకునేందుకే కన్నడ రాజకీయాల ఊసెత్తటం లేదని బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. మరి జేడీఎస్​కు దూరమైతే అక్కడ కేసీఆర్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏ పార్టీకి అండగా ఉంటున్నారు? వంటి అంశాలపై సొంత పార్టీలోనే గందరగోళం నెలకొన్నది.

బీఆర్ఎస్‌‌కు ఫస్ట్ దోస్త్ ఆయనే

కేసీఆర్, కుమారస్వామి మధ్య దోస్తీ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌‌గా మార్చే ప్రకటన మొదలు.. వరుసగా పలు సందర్భాల్లో కేసీఆర్‌‌‌‌తో కుమారస్వామి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పేరును ప్రకటించినప్పుడు, టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుస్తూ కేసీఆర్ సంతకం చేసినప్పుడు కుమారస్వామి ఆయన పక్కనే ఉన్నారు. కర్నాటకలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని నాడు కేసీఆర్ అన్నారు. అక్కడి ప్రచారానికి తమ ఎమ్మెల్యేలు, ఎంపీలను పంపుతామని చెప్పారు. కర్నాటక ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి తమ పార్టీ పని చేస్తుందని కుమారస్వామి చెప్పుకొచ్చారు. తర్వాత ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభ కార్యక్రమానికి కుమారస్వామి హాజరయ్యారు. కానీ ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు కుమారస్వామి రాలేదు.

అప్పట్నుంచీ ఇద్దరి మధ్య గ్యాప్ మొదలైందనే చర్చ జరిగింది. ఈ వార్తలను ఖండించిన కుమారస్వామి.. ఉత్తర కర్నాటకలో రాజకీయ రథయాత్ర చేస్తున్నందున రాలేకపోయానని వివరణ ఇచ్చుకున్నారు. తన తండ్రి దేవెగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరేనని చెప్పుకొచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ తో తమకు పొత్తు లేదని జేడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు బహిరంగంగానే కామెంట్లు చేశారు. కర్నాటకలో జేడీఎస్ మొత్తం 224 సీట్లకు పోటీ చేస్తుందని, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పొత్తు ఉండదని చెప్పారు.

కర్నాటక ప్రచారంలో ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ లీడర్లు

తెలంగాణకు పొరుగునే ఉండటంతో రాష్ట్రంలోని నేతలు కర్నాటక ఎలక్షన్​పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీలో ఉండటంతో ఇక్కడి నుంచి ఆయా పార్టీల లీడర్లు ప్రచారానికి తరలివెళ్లారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న బళ్లారి, బెంగళూరు ఏరియాలో దాదాపు 36  నియోజకవర్గాల్లో ఎక్కువ మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. దీంతో బీజేపీ నుంచి డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, కె.లక్ష్మణ్ ఇప్పటికే అక్కడ ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారం చేయనున్నారు.

కర్నాటక ఎన్నికల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శ్రీధర్ బాబు, స్టార్ క్యాంపెయినర్లుగా రేవంత్ రెడ్డి, అజారుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్ ప్రచారం చేస్తున్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సీతక్కతో పాటు 20 మంది తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కర్నాటకలో క్యాంపెయిన్ చేయనున్నారు. దేశమంతటా పోటీకి బయల్దేరినట్లు పలుమార్లు ప్రకటించిన కేసీఆర్ మాత్రం ఉలకడం లేదు.. పలకడం లేదు. అక్కడ నామినేషన్ల పర్వం పూర్తయినా కూడా.. ఆ పార్టీ నేతలు ఎవరూ అటు వైపు చూడట్లేదు. పైగా మహారాష్ట్రలో 24వ తేదీ సభకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాట్లు చేసుకుంటుండటం గమనార్హం.

ఢిల్లీ భేటీ నుంచే లుకలుకలు

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవ సమయంలో కేసీఆర్, కుమారస్వామి మధ్య కర్నాటక ఎన్నికలపై చర్చ జరిగిందని బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఇద్దరి మధ్య గ్యాప్​ పెంచినట్లు తెలుస్తున్నది. ఎన్నికల నోటిఫికేషన్‌‌కు ముందే కర్నాటకలో తమ అభ్యర్థుల తొలి జాబితాను జేడీఎస్ ప్రకటించింది. 93 మంది పేర్లను రిలీజ్ చేసింది. జేడీఎస్‌‌తో కలిసి పోటీ చేయాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతుంటే కుమారస్వామి ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించటంతో కేసీఆర్‌‌‌‌కు షాక్ ఇచ్చినట్లయింది. ఖమ్మం సభ నుంచి మరింత దూరం పెరిగింది. కర్నాటకలో బీఆర్ఎస్‌‌కు ఒక్క సీటులోనూ పట్టు లేదు. దీంతో కుమారస్వామి మద్దతు లేకుండా పోటీ చేయటం కంటే సైలెంట్​గా ఉండటమే బెటర్ అని బీఆర్ఎస్ భావించింది. బీఆర్ఎస్​ ఏర్పాటు తర్వాత వచ్చిన బీఆర్ఎస్​ ఏర్పాటు తర్వాత వచ్చిన తొలి ఎన్నిక కావటంతో అక్కడ పోటీ చేయాలని తహతహలాడిన కేసీఆర్ కూడా.. జేడీఎస్ ఇచ్చిన షాక్‌‌తో సైలెంటయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.