T20 World Cup: ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో న్యూజిలాండ్ను ఓడించడానికి భారత్ ఎందుకు కష్టపడుతోంది..?

T20 World Cup: ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో న్యూజిలాండ్ను ఓడించడానికి భారత్ ఎందుకు కష్టపడుతోంది..?

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు మరోసారి ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు పోటీ పడటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెంచింది. ఐసీసీ టోర్నీల్లో భారత్‌తో పోలిస్తే న్యూజిలాండ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై న్యూజిలాండ్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ఐసీసీ టోర్నీల్లో భారత్–న్యూజిలాండ్ జట్లు మొత్తం 19 మ్యాచ్‌లు ఆడగా, భారత్ కేవలం 6 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. దీంతో గణాంకాల పరంగా చూస్తే ఈ ఫైనల్‌కు ముందు కివీస్‌దే ఆధిక్యం కనిపిస్తోంది.

ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్ ఆధిపత్యం: 
ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మాత్రం భారత్ ఎక్కువగా ఆధిపత్యం ప్రదర్శించింది. అన్ని ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్‌పై భారత్ అనేక సార్లు సిరీస్‌లు గెలుస్తూ వచ్చింది. కానీ ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఈ రెండు జట్లు తలపడినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.  

భారత్ టాప్ ఆర్డర్ బలహీనత: 
న్యూజిలాండ్ బౌలర్ల ప్రధాన బలం ప్రారంభంలో బంతిని స్వింగ్ చేయడం.. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ కలిసి భారత టాప్ ఆర్డర్‌ను తొందరగా కూల్చేశారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లాంటి ప్రధాన బ్యాటర్లు త్వరగా ఔట్ కావడంతో టీమిండియా మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెరిగి మ్యాచ్‌లో ఓటమిని చవిచూస్తుంది.  

న్యూజిలాండ్ వ్యూహం: 
న్యూజిలాండ్ జట్టు వ్యక్తిగత స్టార్‌లపై కాకుండా టీమ్‌గా ఆడటం వారి ప్రత్యేకత. 2016 టీ20 వరల్డ్ కప్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి స్పిన్ బౌలింగ్‌తో భారత్‌ను కేవలం 79 పరుగులకే ఆలౌట్ చేసింది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో కూడా న్యూజిలాండ్‌కు చాలా కాలం మానసిక ధైర్యం ఎక్కువగా ఉంటుంది. 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ తర్వాత చాలా సంవత్సరాలు భారత్ న్యూజిలాండ్‌పై నాకౌట్ మ్యాచ్‌ల్లో విజయం సాధించలేకపోయింది.

సూర్యకుమార్ టీమ్ ప్రత్యేకత: 
ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు పాత జట్లతో పోలిస్తే కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో ఇండియన్ టీమ్ దూకుడుగా ముందుగా వెళ్తుంది. పవర్‌ప్లేలోనే భారీ షాట్లు ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. మిడిల్  ఓవర్లలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే లాంటి ఫినిషర్లు ఉండటంతో పాటు చివర్లో రింకూ సింగ్ ఉండటం భారత్‌కు పెద్ద బలం. ప్రారంభంలో వికెట్లు పడినా కూడా జట్టు స్కోరింగ్ వేగాన్ని కొనసాగించగలగడం ఈ జట్టుకు ఉన్న ప్రత్యేకత.

ఫైనల్‌లో ఎవరు ఫేవరెట్?: 
చరిత్ర పరంగా చూస్తే న్యూజిలాండ్‌కు కొంత ఆధిక్యం ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ అండ్ దూకుడు వ్యూహంతో భారత్ జట్టు కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. అందువల్ల ఈ ఫైనల్ మ్యాచ్ హైటెన్షన్ పోరుగా మారే అవకాశం ఉంది. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ పోరులో చివరికి ట్రోఫీ ఎవరిని వరిస్తోందో చూడాలి.