కాంగ్రెస్ మాజీ నాయకుల నేతృత్వంలో ఏర్పాటైన రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం కావాలనే ఊహాగానాలు తరచుగా వినిపిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీని వీడి సొంతపార్టీ పెట్టుకున్న ఈ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడటానికి చాలా తీవ్రమైన కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి సొంతపార్టీని ఏర్పాటు చేసుకున్న అనంతరం కాలక్రమేణా అధికారానికి దూరమయ్యాక పార్టీ అధినేతలకు పాత జ్ఞాపకాలపై మమకారం పెరగవచ్చు. కానీ రాజకీయపరంగా వాస్తవాలు తరచుగా జ్ఞాపకాల కంటే చాలా కఠినంగా ఉంటాయి.
ప్రస్తుతం తమ సొంత పార్టీలకు నాయకత్వం వహిస్తున్న అత్యంత ప్రముఖ మాజీ కాంగ్రెస్ నాయకులు ఎన్సీపీ ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో తీవ్రమైన విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కేంద్ర నాయకత్వం తమకు దక్కాల్సిన రాజకీయ స్థానాన్ని నిరాకరించిందని వారు భావించారు. దీంతో వారికి వేరే మార్గం లేక కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారు. అనంతరం వారందరూ తమ సొంత పార్టీలను స్థాపించిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని గొప్ప ఉన్నత శిఖరాలకు ఎదిగారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ఎదుగుదలను అడ్డుకున్నారని, తనను ప్రతిపక్ష నాయకుడిగా చేయలేదని ఆరోపిస్తూ శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయన నిష్క్రమణకు ముందు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒక వాడివేడి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో శరద్‌పవార్, మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి పీఏ సంగ్మా, ఇతరులు సోనియా గాంధీ విదేశీ మూలం అంశాన్ని రాజకీయ యవనికపై లేవనెత్తారు. ఆ తర్వాత వారు పార్టీని వీడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)ని ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్‌తో మమతా బెనర్జీ విడిపోవడం
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ తీవ్రమైన వర్గపోరాటాల ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, 1998లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి ఆమె ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చారు. అప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కానప్పటికీ, సోనియా గాంధీ జోక్యం చేసుకోవాలని మమతా బెనర్జీ ఆమెకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌లో తాను కొనసాగడానికి సోనియా గాంధీ సహాయం చేయలేదని మమత స్వయంగా చాలాసార్లు బహిరంగంగా చెప్పారు. మమతను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించగా, ఆమె తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించి మూడుసార్లు వరుసగా బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు.
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిష్క్రమణ
తన తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి జగన్ అర్హుడని చాలామంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రిగా నియమించడానికి నిరాకరించింది. తన రాజకీయ ఆశయాలను అడ్డుకోవడానికి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తనపై చట్టపరమైన కేసులను ప్రయోగించిందని జగన్ భావించారు. ఈ క్రమంలో జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి సొంతపార్టీ వైఎస్ఆర్ సీపీని స్థాపించి, చివరికి 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
విలీనం గురించి శరద్ పవార్ ఎందుకు ఆలోచించవచ్చు?
1999లో స్థాపించిన శరద్ పవార్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తన ఉనికిలో ఎక్కువ కాలం కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించింది. అయితే, గత రెండేళ్లలో ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ నాయకత్వంలో జరిగిన భారీ చీలిక కారణంగా ఎన్‌సిపి (ఎస్‌పీ) గణనీయంగా బలహీనపడింది. అజిత్ పవార్ పార్టీలోని అనేకమంది నాయకులను తనతోపాటు తీసుకువెళ్లారు. సమర్థవంతమైన రాజకీయ నాయకురాలిగా పెద్దగా గుర్తింపు పొందలేకపోయిన తన కుమార్తె సుప్రియా సూలే రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం శరద్ పవార్ తన పార్టీ ఎన్‌సీపీ (ఎస్‌పీ)ని కాంగ్రెస్‌లో విలీనం గురించి ఆలోచించవచ్చు.
మమతా బెనర్జీ విలీనాన్ని వ్యతిరేకించవచ్చు
మే 4, 2026న వెల్లడైన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎదురైన భారీ ఓటమితో షాక్‌కు గురైన మమతా బెనర్జీ ఆందోళనతో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ మద్దతు కోరారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమత ఎప్పుడూ ఇలాంటి దీనమైన లేదా అభ్యర్థించే ధోరణిని ప్రదర్శించలేదు. అయితే, తర్వాత ఆమెకు వాస్తవ పరిస్థితిపై స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ అనే భారీ వ్యవస్థలో తృణమూల్ కాంగ్రెస్ విలీనం కావడం వల్ల తన ఉనికి కేవలం ఒక చిన్న భాగంలా మారిపోతుందని ఆమె గ్రహించారు. విలీనం చేస్తే ప్రారంభంలో తమకు ఘన స్వాగతం లభించినప్పటికీ, ఆ తర్వాత తమపట్ల చాలా నిర్లక్ష్యంగా లేదా తక్కువ గౌరవంతో వ్యవహరిస్తారని మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ గ్రహించారు. గత చరిత్ర కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
అనేక ప్రాంతీయ పార్టీలు ఉండటం వల్ల కాంగ్రెస్‌కు ప్రయోజనం
కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రాంతీయ మిత్రపక్షాన్ని తనలో కలుపుకోవడానికి ప్రయత్నించకూడదు. ప్రాంతీయ పార్టీలు తరచుగా బలమైన స్థానిక నాయకత్వ
నెట్‌వర్క్‌లు, సామాజిక కూటములను కలిగి ఉంటాయి. వాటిని కాంగ్రెస్ స్వయంగా అంత సులభంగా పునఃసృష్టించలేదు. ఎన్నికలపరంగా సహకరిస్తూనే, అటువంటి పార్టీలను స్వతంత్రంగా ఉండనివ్వడం ద్వారా కాంగ్రెస్ లాభపడుతుంది. రాజస్థాన్‌లో 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేశారు. కానీ 200 ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ కేవలం 115 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. చిన్న పార్టీలు 15 స్థానాలను, కాంగ్రెస్ 70 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ప్రతి చిన్న పార్టీ బీజేపీకి సవాలుగా నిలవగలదని ఆ ఫలితాలు చెప్పాయి.
గుర్తింపు, ప్రతిష్ట కోల్పోవడం
మమతా బెనర్జీ, శరద్ పవార్, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తమ సొంత రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నందున గణనీయమైన ప్రతిష్టను అనుభవిస్తున్నారు. కేవలం కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న చాలా చిన్న పార్టీల నాయకులు కూడా, తమ సొంత సంస్థలను నియంత్రించగలగడం వల్ల తరచుగా గౌరవాన్ని పొందుతారు. అలాంటి పార్టీలు ఒక పెద్ద జాతీయ పార్టీలో విలీనమైనప్పుడు, ప్రాంతీయ పార్టీ నాయకులు తమ బేరసారాల శక్తిని పూర్తిగా కోల్పోతారు. వారు వర్గ నాయకులుగా మారిపోతారు.
ఒకవేళ వారు తమ పార్టీలను విలీనం చేసుకుంటే, విలీనమైన పార్టీల నాయకులు ఎవరినీ ఇండియా అలయన్స్ సమావేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానించరు. చాలామంది నాయకులు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి తమ సొంత పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో ఎక్కువమంది రాజకీయాలపరంగా విజయవంతంగానే ఉన్నారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లడం అంటే వారు తమ హోదాను కోల్పోయి, ఇతరులతో పాటు వరుసలో నిలబడటమే అవుతుంది. జంతు ప్రదర్శనశాలల నుంచి పులులు, సింహాలు పారిపోవడం గురించి విన్నాం. కానీ అడవుల నుంచి పులులు, సింహాలు జంతు ప్రదర్శనశాలలకు రావడం గురించి ఎవరూ వినలేదు.
స్వేచ్ఛ, గౌరవం అనేవి దేనికోసమైనాసరే వదులుకోలేనంత గొప్పవి అని గ్రహించాలి! విలీనమయ్యాక తమకు గుర్తింపు ఇవ్వడం లేదనే భావన ఏర్పడితే, విలీనమైన ఆయా పార్టీలు తిరిగి సొంత పార్టీల పున:స్థాపనకూ ప్రయత్నించవచ్చు. కాబట్టి విలీనాలు హానికరమేననే అనుమానమూ రాక మానదు!
జాతీయ పార్టీల్లో విలీనమైతే..
బీజేపీ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాలలో మమతా బెనర్జీ వంటి నాయకులను కాంగ్రెస్‌లో విలీనం కావాలని బలవంతం చేయడం వల్ల విలీనమైన పార్టీ ఓటర్లు లేదా సంస్థాగత నెట్‌వర్క్‌లు పూర్తిగా బదిలీ అవుతాయని కచ్చితమైన గ్యారెంటీ ఉండదు. మరొక ఆచరణాత్మక సమస్య ఏమిటంటే, ప్రాంతీయ నాయకులు ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉంటారు.
ముఖ్యమంత్రులు మినహా, అధికారిక సమావేశాలు ఉంటే తప్ప బీజేపీ లేదా కాంగ్రెస్ అగ్ర నాయకులు స్థానిక నాయకులను ఎవరినీ కలవరు. ఒక పార్టీ ఒక పెద్ద జాతీయ పార్టీలో విలీనమయ్యాక ఢిల్లీలో వారికి అనుచరగణాలు ఎదురవుతారు. ఎలాంటి అధికారిక నియామకాలు ఉండవు. లెక్కలేనంత మంది రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు బయోడేటాలతో ఢిల్లీలో తిరుగుతూ, కాంగ్రెస్, బీజేపీ అగ్ర నాయకులను కలవడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ అగ్ర నాయకులు వారిని ఎన్నడూ కలవరు.
- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
