మ్యూచువల్ ఫండ్లలో SIP పెట్టుబడి పెట్టడం గడచిన కొన్నేళ్లుగా ఒక ట్రెండ్‌గా మారింది. క్రమశిక్షణతో కూడిన పొదుపుకు ఇది ఉత్తమ మార్గమైనప్పటికీ.. చాలా మంది పెట్టుబడిదారులు మధ్యలోనే తమ సిప్ లను నిలిపివేస్తున్నారు. అసలు ఇన్వెస్టర్లు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? పెట్టుబడులు నిలిపివేయటానికి వెనుక ఉన్న కీలక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
1. రియాలిటీకి మించిన ఎక్స్‌పెక్టేషన్స్:
చాలా మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌ను లాటరీలా భావిస్తారు. 6 నెలలకో, ఏడాదికో భారీ లాభాలు రావాలని గాల్లో లెక్కలు కడుతుంటారు. కానీ.. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల స్వల్పకాలంలో రాబడి ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఓపిక లేకపోవడం వల్ల ఫండ్ పనికిరాదని ముద్రవేసి.. నష్టాల్లో ఉన్నప్పుడే బయటకు వచ్చేస్తున్నారు నేటి తరం ఇన్వెస్టర్లు. గుర్తుంచుకోండి.. మ్యూచువల్ ఫండ్లలో సంపద సృష్టించబడాలంటే కనీసం 5 నుంచి 10 ఏళ్ల టైమ్ పడుతుంది.
2. ఫైనాన్షియల్ ప్రణాళిక లేకపోవడం:
చాలా మంది పెట్టుబడులు పెట్టే కొత్తలో ఉత్సాహంతో పెద్ద మొత్తంలో SIPలు ప్రారంభిస్తారు. కానీ ఇంటి ఖర్చులు, అప్పులు పెరిగేసరికి పెట్టుబడి భారంగా మారుతుంటుంది. దీంతో చేసేది లేక ఇన్వెస్ట్మెంట్స్ నిలిపేస్తుంటారు మధ్యలోనే. ఇలాంటి వారు 50:30:20 సూత్రాన్ని పాటించడం వల్ల సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్కోవచ్చు.
* 50%: అద్దె, ఇంటి ఖర్చులు వంటి అవసరాలకు
* 30%: షాపింగ్, ట్రావెల్ వంటి కోరికలకు
* 20%: పెట్టుబడులకు కేటాయించాలి. ఇలా చేస్తే సిప్స్ ఆపాల్సిన అవసరం ఉండదు.
3. మార్కెట్ పతనం చూసి భయపడి:
స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు భయంతో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. నిజానికి మార్కెట్ కనిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడే ఎక్కువ యూనిట్లు పొందే అవకాశం ఉంటుంది. దీనినే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. తెలివైన ఇన్వెస్టర్లు తక్కువ రేటులో మంచి ఫండ్స్ లో ఎక్కువ యూనిట్లు దక్కించుకోవటానికి మార్కెట్ నష్టాలను తెలివిగా వాడుకుంటుంటారు.
4. లక్ష్యం నెరవేరడం:
పిల్లల చదువులు, పెళ్లిళ్లు లేదా ఇల్లు కొనడం వంటి లక్ష్యాల కోసం SIPలు చేసేవారు.. ఆ కాలపరిమితి ముగియగానే నిధులు వెనక్కి తీసుకుంటారు. ఇది సహజమే అయినా చాలా మంది పెట్టుబడిని కొనసాగించి సంపదను మరింత పెంచుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు.
మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని, క్రమశిక్షణతో SIP కొనసాగించిన వారే దీర్ఘకాలంలో కోటీశ్వరులు కాగలరు. కొత్తగా పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల గురించి, తెలియక చేసే తప్పుల గురించి తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించుకోవటం ద్వారా మంది ఆర్థిక భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
