భీమవరం, గాజువాక నుంచే పవన్ పోటీ ఎందుకంటే..?

భీమవరం, గాజువాక నుంచే పవన్ పోటీ ఎందుకంటే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలనుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి… విశాఖపట్నం జిల్లా గాజువాక సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ రెండు నియోజకవర్గాలనే పవన్ కల్యాణ్ ఎంచుకోవడానికి కారణాలేంటనేదానిపై అంతటా చర్చ జరుగుతోంది.

భీమవరం

  • భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని పవన్ కల్యాణ్ నిర్ణయించడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. అందులో ఒకటి కాపు కమ్యూనిటీ, రెండు ఫ్యాన్స్.
  • భీమవరంలో కాపులు ఎక్కువ. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల గెలుపు, ఓటములను కులం కార్డు డిసైడ్ చేస్తుందన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ కూడా… తన సామాజిక వర్గ ఓటర్లను నమ్ముకున్నారు.
  • భీమవరంలో పవన్ కల్యాణ్ కు కొండంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ప్రాంతంలో మరో హీరో ఎదుగుతుంటే.. పవర్ స్టార్ అభిమానులు మరో హీరో పాపులారిటీని తగ్గించేందుకు భారీ స్కెచ్చులు వేస్తుంటారు. గొడవలు కూడా జరుగుతుంటాయి. ఐతే… సినిమా వాళ్లంతా ఒక్కటే అనే మెసేజ్ కనుక బయటికొస్తే.. పవన్ కల్యాణ్ కు తిరుగుండదు. బంపర్ మెజారిటీ ఖాయం. సినీ అభిమానుల నుంచి గంపగుత్త ఓట్లు పడతాయనడంలో డౌటే లేదు.
  • గతంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి భీమవరంలో ఓడిపోయారు. టీడీపీ నాయకుడు, మంత్రి గంటా వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. సో.. ప్రభుత్వ వ్యతిరేకత కూడా పవన్ కల్యాణ్ కు కలిసివచ్చే చాన్సుంది.

గాజువాక

  • గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి.
  • విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో యాదవులు మెజారిటీ ఓటర్లు. యాదవుల తర్వాత అక్కడ ఎక్కువగా ఉన్నది కాపులే. కమ్యూనిటీ పరంగా ఇది పవన్ కల్యాణ్ కు కలిసివచ్చే అంశమే. పవన్ కల్యాణ్ కు ఉన్న పర్సనల్ ఇమేజ్ కూడా ఓట్లను ఆకర్షించేదే.
  • గాజువాక పారిశ్రామిక ప్రాంతం. పవన్ రెగ్యులర్ గా తన మెడలో వేసుకునే ‘ఎర్ర తుండు’కు సలాం చేసే ఏరియా ఇది. జనసేన మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎంలకు కార్మికుల్లో మంచి పట్టుంది. ఎర్రజెండా పవన్ కల్యాణ్ కు ఇక్కడ ఓట్లు కురిపించే అవకాశాలు ఎక్కువ.
  • టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ గాజువాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే. ఐతే.. టీడీపీ నేత శ్రీనివాస్, వైసీపీ క్యాండిడేట్ తిప్పల నాగిరెడ్డిపై ఇక్కడ అసంతృప్తి ఉంది. అది పవన్ కల్యాణ్ కు ప్లస్ అయ్యే చాన్సుంది.
  • గాజువాకలో మెగాస్టార్, పవర్ స్టార్ లకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
  • 2009లో ప్రజారాజ్యం గెలిచిన 18 సీట్లలో గాజువాక కూడా ఒకటి.

గతంలో చిరంజీవి రెండు నియోజకవర్గాలు పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీచేశారు. ఐతే.. పాలకొల్లులో ఓడిపోయిన చిరంజీవి.. తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐతే.. ఈసారి పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లో గెలుస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.