మహాలయ పక్షాల్లో పితృదేవతలకు ఎందుకు అన్నం పెట్టాలి.. పురాణాలు ఏం చెబుతున్నాయి..!

మహాలయ పక్షాల్లో  పితృదేవతలకు  ఎందుకు అన్నం పెట్టాలి.. పురాణాలు ఏం చెబుతున్నాయి..!

పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ.  వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు. బాధ్రపదమాసం కృష్ణపక్షం అమావాస్య రోజున ( సెప్టెంబర్​ 21)   పితృదేవతలను అర్చించాలి.  అలాంటి వారికి మహాలయ పక్షాల్లో ఆతిథ్యమిచ్చి ... సంతృప్తి పర్చాలని  పురాణాలు చెబుతున్నాయి.  

నవమాసాలు కడుపులో పెట్టుకొని, రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి, పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి కృతజ్ఞత చూపడము మానవత్వము ...  అలాంటి వారికి ఉత్తమగతులు చేకూర్చడం మన విధి.  అందుకే పితృ దేవతలకు ఇష్టమైన మహాలయ పక్షాల రోజుల్లో వారికి తర్పణాలు వదలాలి.. ఆహారం అందించాలని గరుడపురాణంలో ఉంది.

మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక... వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. దీని  కోసమే  మాసికాలు.. ఆబ్దీకాలు.. మహాలయ పక్షాల్లో  తర్పణాలు.. పిండ ప్రదానం...  మెదలగునవి  చేయాలని పండితులు చెబుతున్నారు. 

మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు ... మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే బాధ్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చాలి.  కాని ప్రస్తుత కాలంలో వివిధ కారణాలతో చాలా మంది ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నందుకు ... చాలా  భాధపడుతున్నారు. 

కొంత మంది  కాశీలోనో ఏ గయలోనో పితృ తర్పణాలు ఒక్కసారి చేస్తే సరిపోతుందని అనుకుంటారు. అది పొరపాటు. ఎందుకంటే పుణ్య నదులలో పుణ్యక్షేత్రాలలో చేసిన కర్మలు పవిత్రమైనవే కాని అవి పూర్తిగా సమాప్తం కావు. కాబట్టి పుత్రులు తామున్నంత వరకు పితృకార్యాలుల్లో భాగంగా మహాలయ పక్షాల్లో పితృ దేవతలకు ఆహారం అందించాలి.  

మహాలయ పక్షాల్లో.. కేవలం తల్లి దండ్రులకే కాదు..  మావయ్య, అత్తయ్య, తాత, బామ్మ, అమ్మమ్మ, అన్న, వదిన, తమ్ముడు, భార్య, కొడుకు, పిన్ని, బాబయ్య, పెద్దమ్మ, పెద్దనాన్న మొదలగు వారికి కూడా తర్పణాలు సమర్పించినచో  వారు మోక్షమార్గం పొందగలరు. ఇది మన భారతీయతలోని సనాతన ధర్మం, సంప్రదాయం తద్వారా వారి వంశాభివృద్దిని ఆయుక్షేమాన్ని, సుఖ శాంతులను పొందగల్గుతారు.