- సెన్సెక్స్ 893 పాయింట్లు డౌన్
- 278 పాయింట్లు తగ్గిన నిఫ్టీ
- రూ.5.77 లక్షల కోట్లు ఆవిరి
న్యూఢిల్లీ: ఏఐ ఆధారిత స్టాక్స్ ర్యాలీ భవిష్యత్‌పై ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళనలు రేకెత్తడం, భారీ ఎత్తున షేర్ల అమ్మకాలు జరగడంతో ప్రపంచవ్యాప్త ఈక్విటీ మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో ఏఐ చిప్స్ తయారు చేసే సెమీకండక్టర్ కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి.
దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ సూచీ ఏకంగా 10 శాతం మేర పతనమైంది. అక్కడి చిప్స్ తయారీ సంస్థలైన ఎస్కే హైనెక్స్ 11 శాతం, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ 8 శాతానికిపైగా నష్టపోయాయి. దీంతో కొరియా ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌ను 20 నిమిషాల పాటు నిలిపివేశారు.
అమెరికా మార్కెట్లో స్పేస్ ఎక్స్ షేర్లు పడిపోవడం, రానున్న మైక్రాన్ టెక్నాలజీ క్వార్టర్ ఫలితాల వెల్లడి ముందస్తు భయాలు ఏఐ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ గ్లోబల్ టెక్ సంక్షోభ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా పడింది. ఎఫ్ఐఐలు నిధులు వెనక్కి తీసుకోవడం, ఐటీ రంగంలో భారీ విక్రయాలు చోటుచేసుకోవడంతో సెన్సెక్స్, నిఫ్టీ ఒకశాతానికిపైగా క్షీణించాయి. సెన్సెక్స్ 893.39 పాయింట్లు నష్టపోయి 76,200.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 278.80 పాయింట్లు కోల్పోయి 23,824.10 వద్ద స్థిరపడింది.
ఐటీ ఇండెక్స్ 2.24 శాతం డౌన్
గ్లోబల్ టెక్ పతనం దేశీయ ఐటీ రంగంపై ఒత్తిడి పెంచింది. భారతీయ ఐటీ రంగంలో ఏఐ వల్ల వచ్చే ఇబ్బందులపై ఉన్న ఆందోళనలతో ఐటీ ఇండెక్స్ 2.24 శాతం నష్టపోయింది. సెన్సెక్స్ నుంచి ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 3 శాతం వరకు నష్టపోయాయి.
హెచ్‌సీఎల్ టెక్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ కూడా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, మారుతీ సుజుకి మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం రూ. 635.91 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించడం కూడా మార్కెట్ ఒత్తిడిని పెంచింది.
యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు భయాలు
పెరిగిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఆందోళనలను మళ్లీ రేకెత్తించాయి. వడ్డీ రేట్లు ఎక్కువ కాలం గరిష్ట స్థాయిలోనే కొనసాగుతాయనే అంచనాలను ఇవి బలపరిచాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) యూఎస్ ఫెడ్ ఈ ఏడాది మూడు సార్లు రేట్లు పెంచుతుందని అంచనా వేసింది. ఇదే జరిగితే బెంచ్‌మార్క్ పాలసీ రేటు 4.50 శాతానికి చేరుతుంది. బలమైన లేబర్ మార్కెట్ డేటా, ద్రవ్యోల్బణం దీనికి కారణాలని పేర్కొంది.
యూఎస్ లో వడ్డీ రేట్లు పెరిగితే ఎఫ్ఐఐలు భారత మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. యూఎస్ ట్రెజరీ బాండ్ల వైపు ఆకర్షితులవుతారు. ఇవన్నీ ఇన్వెస్టర్లను టెన్షన్ పెట్టడంతో సోమవారం యూఎస్ మార్కెట్లు పడ్డాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ ఎక్కువ నష్టపోయాయి.
16 శాతం తగ్గిన స్పేస్ ఎక్స్ షేర్లు
ఇటీవల మార్కెట్లోకి వచ్చిన స్పేస్‌ఎక్స్ షేర్లు ప్రారంభంలో భారీగా పెరిగినప్పటికీ, ఇప్పుడు భారీగా పతనమవుతున్నాయి. కంపెనీ షేరు సోమవారం ఒక్క రోజే 16 శాతం నష్టపోయింది. కొన్ని రోజుల్లోనే కంపెనీ వాల్యుయేషన్దాదాపు 400 బిలియన్ డాలర్లు తగ్గింది.
భారీగా అప్పులు, నష్టాలు, వాల్యుయేషన్ ఆందోళనలు ఇందుకు కారణాలు. ఈ సంస్థ 'కర్సర్' అనే ఏఐ కోడింగ్ స్టార్టప్‌ను 60 బిలియన్ డాలర్లకు కొంటున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఓపెన్ మార్కెట్లో షేర్ల విలువ మరింత పడిపోయే అవకాశం ఉందనే భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.
