చనిపోయిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇంత గుర్తింపు ఎందుకు ఉందంటే..

చనిపోయిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇంత గుర్తింపు ఎందుకు ఉందంటే..
  • నేలకొరిగిన ఓరుగల్లు ఉద్యమ నేత ‘పెద్ది’
  • పెద్ది మృతితో చిన్నబోయిన నర్సంపేట
  •  ప్రపంచం దృష్టికి ప్రకాశ్​రెడ్డి పేట సభ...
  • ఎమ్మెల్యేగా నర్సంపేట డెవలప్​మెంట్​పై స్పెషల్ ఫోకస్
  • నియోజకవర్గానికి మెడికల్ కాలేజీని సాధించిన ధీరుడు

వరంగల్ /నర్సంపేట /నల్లబెల్లి, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లును ముందుకు నడిపించిన నేతగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉంది. 2001లో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న పెద్ది.. నర్సంపేట నుంచి జిల్లాస్థాయికి ఎదిగి ఉమ్మడి జిల్లా నేతలను ఉద్యమం వైపు నడిపించారు.

టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూనే వివిధ పార్టీలకు చెందిన నేతలతో ఉద్యమానికి జై కొట్టించారు. కాకతీయ యూనివర్సిటీ వేదికగా కేయూ స్టూడెంట్లతో కలిసి గ్రేటర్ వరంగల్ లో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. నర్సంపేట ఎమ్మెల్యేగా, సివిల్​ సప్లయ్​ కార్పొరేషన్​ చైర్మన్​గా తనదైన ముద్రవేసి.., ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా గుర్తింపు పొందిన ‘పెద్ది’ మృతితో ‘నర్సంపేట’ చిన్నబోయింది. 

ప్రకాశ్​రెడ్డిపేట సభతో ప్రపంచం దృష్టికి 'పెద్ది'.. 
బీఆర్ఎస్ లో  8 ఏండ్ల పాటు పెద్ది సుదర్శన్​రెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2010లో ఓరుగల్లు కేంద్రంగా హన్మకొండలోని ప్రకాశ్​రెడ్డి పేట ప్రాంతంలో నిర్వహించిన సింహగర్జన ప్రోగ్రామ్​లో కీలకంగా వ్యవహరించారు. 25 లక్షల మంది ఈ సభకు అధ్యక్షత వహించి..  గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు ఉద్యమకారులు, జనాల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఈ సభ ప్రపంచంలోనే అతి పెద్దసభగా పేరుగాంచడాన్ని గిన్నీస్ బుక్లో రికార్డు అయింది.

జిల్లా మెడికల్ కాలేజీ నర్సంపేటకే.. 
జిల్లాల విభజన అనంతరం వరంగల్ జిల్లాకు కేటాయించిన మెడికల్ కాలేజీని నర్సంపేటకు తీసుకరావడంలో పెద్ది పోషించిన పాత్ర చారిత్రాత్మకం. వరంగల్ జిల్లాలో ఆనాడు ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు జిల్లాకు చెందిన మంత్రి ఉన్నారు. మా ప్రాంతానికే జిల్లా మెడికల్ కాలేజీ ఇవ్వాలని నలుగురు లీడర్లు కేసీఆర్ వద్ద పట్టుబట్టారు. అయితే తన దైన శైలిలో పెద్ది కేసీఆర్​ను ఒప్పించి నర్సంపేటకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు.

గోదావరి జలాలతో సస్యశ్యామలం..
నర్సంపేట ప్రాంతంలోని రైతాంగానికి పాకాల చెరువు నీరే ఆధారం. వర్షాభావ పరిస్థితులు వస్తే పంటలు పండే పరిస్థితి లేదు. ఈ క్రమంలో గోదావరి జలాలను రామప్ప చెరువుకు మళ్లించి, తద్వారా లిప్ట్ ఇరిగేషన్, పైప్లైన్ ద్వారా పాకాల చెరువులోకి నీటిని మళ్లించే ప్రాజెక్టుకు కేసీఆర్​ను ఒప్పించారు. దీని ఫలితంగా పాకాల చెరువు కింద ఎండ, వానాకాలం పంటలకు సంబంధించి 30వేల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. నల్లబెల్లి మండలంలోని రంగయ్య చెరువు ప్రాజెక్టు కింద 8 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది.

నాడు ఆర్ఎస్ శిష్యుడు.. నేడు కేసీఆర్ ఇంటి మనిషి
పెద్ది సుదర్శన్​రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభమైంది. ఆనాటి వరంగల్ ఎంపీ రామసహాయం సురేందర్​రెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యూఐలో పనిచేశారు. ఆ తర్వాత నల్లబెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వాదుగ్గొండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో యూత్ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పెద్ది 2001లో టీఆర్ఎస్​ పార్టీలో చేరారు. ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ 2004లో పొత్తులో భాగంగా నర్సంపేట స్థానంలో కంభంపాటి లక్ష్మారెడ్డి విజయం కోసం పనిచేశారు.

2006 నుంచి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తూ కేసీఆర్​ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్​ నర్సంపేట అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2018లో తిరిగి అదే పార్టీ నుంచి విజయం సాధించి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో పరాజయం చెందారు. అయినప్పటికీ క్యాడర్​ను ఉత్తేజపర్చడంతో పాటు ప్రజా సమస్యలే ఏజెండాగా తన దైన శైలిలో ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజాక్షేత్రంలో ఉన్నారు. 

స్వప్నతో ప్రేమ, పెళ్లి..!
తెలంగాణ ఉద్యమ సమయంలో కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారిణిగా పెద్ది స్వప్నతో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలానికే అది కాస్తా ప్రేమగా మారగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే పెళ్లి చేసుకుంటానని చెప్పిన పెద్ది తన కలను సాకారం చేస్తూ రాష్ర్టం ఏర్పడ్డాక స్వప్నను తిరుపతిలో కేసీఆర్​ సమక్షంలో 2018 మార్చి 28న ఆదర్శ వివాహం చేసుకున్నారు. స్వప్న సైతం రాజకీయాల్లో రాణించారు. నల్లబెల్లి జడ్పీటీసీగా విజయం సాధించి వరంగల్ జిల్లా జడ్పీ ఫ్లోర్​ లీడర్​గా పనిచేశారు. కాగా, పెద్ది దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు.

నర్సంపేటపై స్పెషల్ ఫోకస్..
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రధాతల్లో పెద్ది సుదర్శన్​రెడ్డి నిలిచారు. ప్రధానంగా రామప్ప - పాకాల, రామప్ప - రంగయ్య చెరువు, నర్సంపేటకు జిల్లా జనరల్ హాస్పిటల్ ​పాటు మెడికల్ కాలేజీని తీసుకొచ్చాడు. ఇరిగేషన్ సర్క్యూట్ లక్ష్యంగా దేవాదుల నీటిని అనేక చెరువులకు మళ్లించి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించారు. ప్రత్యేకంగా అనేక పైలట్ ప్రాజెక్టులను తీసుకొచ్చితన నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేశాడు.