
హైదరాబాద్, వెలుగు: సీఎస్ సోమేశ్ కుమార్, ఇన్చార్జి డీజీపీ అంజనీకుమార్ సహా 13 మంది ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపుల వివాదాలపై సమాధానం చెప్పాలని, వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపులపై గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలన్న కేంద్రం పిటిషన్లపై బుధవారం చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ విచారించింది. చిత్తూరు అదనపు ఎస్పీ అభిషేక్ మహంతికి పోస్టింగ్ ఇచ్చే విషయంలో ఒక్కో అధికారి ఒక్కో న్యాయమేంటని ప్రశ్నించింది. అయితే, మిగతా పిటిషన్లు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్‌రెడ్డి సీజే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అభిషేక్ మహంతి కేటాయింపు వివాదంపై కేంద్రం వేసిన పిటిషన్‌నూ జస్టిస్ భూయాన్ బెంచ్‌కే సీజే పంపించారు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్.. అభిషేక్ మహంతితో పాటు ఐఏఎస్‌ల కేటాయింపులపై కౌంటర్లు వేయాలని సర్కార్‌ను ఆదేశించి, విచారణను మార్చి 24కి వాయిదా వేసింది.