FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) టోర్నమెంట్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ సారి అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్ జట్లు హాట్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయి. అయితే ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ అసలు ధర ఎంత?.. 2026లో ఈ ట్రోఫీని తయారు చేయాలంటే ఎంత ఖర్చవుతుంది? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతుంది.
ఈ ట్రోఫీ చాలా వాల్యూ అయింది. కానీ కేవలం దాని తయారీకి ఉపయోగించిన బంగారం, ఇతర ఖనిజాల ఆధారంగా ప్రస్తుత మార్కెట్ ప్రకారం లెక్కిస్తే దీని విలువు సుమారు 2,50,000 యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లకు పైగా) ఉంటుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరగడం, దీని తయారీకి అద్భుతమైన హస్తకళా నైపుణ్యం అవసరం కావడమే ఇందుకు కారణం.. అయితే ఒకవేళ ఈ అసలు ట్రోఫీని గనుక వేలంలో ఉంచితే దీని ధర ఈజీగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.167 కోట్లకు పైగా) పలుకుతుందని అంచనా.
37 సెంటిమీటర్ల ట్రోఫీ:
37 సెంటిమీటర్ల ఎత్తు ఉండే ఈ ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. దీని బరువు దాదాపు 6 కిలోగ్రాములు ఉంటుంది. ఇద్దరు మనుషులు భూగోళాన్ని చేతులతో పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా ఈ ట్రోఫీ డిజైన్ ఉంటుంది. ఈ ట్రోఫీ లోపలి భాగం పూర్తిగా బంగారంతో నింపబడి ఉండదు.. లోపల కొంత భాగం ఖాళీగా ఉంటుంది. ఒకవేళ ఇది పూర్తిగా సాలిడ్ గోల్డ్‌తో చేసి ఉంటే.. బరువు చాలా ఎక్కువగా ఉండి ఆటగాళ్లు చేతులతో పైకి ఎత్తడం మస్తు కష్టమయ్యేది.. ఇక ఈ ట్రోఫీ కింది భాగంలో 'మలాకైట్' అనే ఆకుపచ్చ రంగు సెమీ-ప్రిషియస్ ఖనిజంతో చేసిన రెండు పొరలను అమర్చుతారు.
సిల్వియో గజ్జాని కొత్త డిజైన్:
1970లో మెక్సికోలో జరిగిన ప్రపంచకప్‌లో బ్రెజిల్ జట్టు మూడోసారి విజేతగా నిలిచింది. దాంతో అప్పటి వరకు ఉన్న పాత జూల్స్ రిమెట్ ట్రోఫీని శాశ్వతంగా బ్రెజిల్ దేశానికే ఇచ్చేశారు. దీని తర్వాత కొత్త ట్రోఫీ డిజైన్ కోసం 1970లో ఫిఫా ఓ అంతర్జాతీయ పోటీని నిర్వహించింది. అప్పుడు ఇటలీకి చెందిన ప్రముఖ శిల్పి సిల్వియో గజ్జానిగా రూపొందించిన డిజైన్ కొత్త ట్రోఫీగా ఎంపికైంది. ఈ సరికొత్త ట్రోఫీని మొదటిసారిగా 1974లో లెజెండరీ డిఫెండర్ ఫ్రాంజ్ బెకెన్‌బాయర్ నాయకత్వంలోని వెస్ట్ జర్మనీ జట్టు సొంతం చేసుకుంది.
వరల్డ్ కప్ గెలిచిన జట్లకు అసలు ట్రోఫీ ఇవ్వరు:
ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే వేడుకల తర్వాత ఆ ఒరిజినల్ ట్రోఫీని తిరిగి జూరిచ్‌లోని ఫిఫా ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. ఒరిజినల్ ట్రోఫీపై పూర్తి హక్కులు ఫిఫా సంస్థకే ఉంటాయి. మరి గెలిచిన దేశానికి ఏమి ఇస్తారంటే.. ఒరిజినల్ ట్రోఫీ తరహాలోనే ఉండే ఒక గోల్డ్-ప్లేటెడ్ బ్రాంజ్ రెప్లికా (బంగారు పూత పూసిన కాంస్య నకిలీ ట్రోఫీని) బహుమతిగా అందజేస్తారు. దానినే ఆయా దేశాలు తమ వెంట తీసుకెళ్తాయి.
