భర్త బతికి ఉండగానే వితంతు పెన్షన్

భర్త బతికి ఉండగానే వితంతు పెన్షన్
  • కౌన్సిలర్​పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కమిషనర్, కేసు నమోదు

గద్వాల, వెలుగు: భర్త బతికి ఉండగానే ఓ బీఆర్ఎస్​ నేత భార్య వితంతు పెన్షన్  తీసుకోవడం కలకలం రేపుతోంది. వితంతు పెన్షన్  తీసుకుంటున్న సదరు మహిళ ఇటీవల జరిగిన మున్సిపల్  ఎన్నికల్లో 36వ వార్డ్  కౌన్సిలర్ గా ఎన్నికైంది. వివరాల్లోకి వెళితే.. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డుకు చెందిన సునీత, రాము భార్యాభర్తలు. భర్త బతికుండగానే చాలా రోజుల నుంచి సునీత వితంతు పెన్షన్  తీసుకుంటోంది.

ఎన్నికలకు ముందు తనకు పెన్షన్  వస్తోందని, క్యాన్సిల్​ చేయాలని మున్సిపాలిటీలో దరఖాస్తు పెట్టి పెన్షన్ ను నిలిపివేయించారు. పెన్షన్  నిలిపేయాలని ఆమె పెట్టిన దరఖాస్తు ఆధారంగా, ప్రభుత్వాన్ని మోసం చేశారంటూ ఆమె ప్రత్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్  ఎన్నికల్లో హేమాహేమీలను ఓడించి భారీ మెజార్టీతో గెలవగా, ఇప్పుడు వితంతు పెన్షన్ వివాదం  తెరపైకి రావడంతో కలకలం రేపుతోంది.

శనివారం మున్సిపల్  కమిషనర్  జానకీరాం సాగర్  భర్త బతికుండగానే పెన్షన్  తీసుకున్నారంటూ సునీతపై గద్వాల పట్టణ పోలీసులకు కంప్లైంట్  చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కల్యాణ్ కుమార్  తెలిపారు. సునీత మాట్లాడుతూ తనకు చదువు రాదని, దూరపు బంధువు బీడీ కార్మికురాలి పెన్షన్  ఇప్పిస్తామంటే ఆధార్  కార్డు, పాస్  బుక్  ఇచ్చానని చెప్పారు. వితంతు పెన్షన్  అని తెలిసి క్యాన్సిల్​ చేయాలని దరఖాస్తు చేశానని పేర్కొన్నారు.