శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొల్లెబోయిన స్వామి (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అతని భార్య ప్రియుడితో కలసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. శుక్రవారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగాకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 23న నేరెళ్లకుంటలో అనుమానాస్పద స్థితిలో స్వామి డెడ్‌బాడీ కనిపించగా, తన భర్త సర్పంచ్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వెళ్లి మద్యం తాగి వచ్చాడని, ఉదయం నుంచి ఇంట్లో కనిపించడం లేదని భార్య మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోస్ట్‌మార్టంలో డెడ్‌బాడీపై గాయాలు కనిపించడంతో పోలీసులు మౌనికను అదుపులోకి తీసుకొని విచారించారు. మౌనికకు కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన వీరప్పగారి సంపత్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడు నెలల కింద గ్రామంలో పంచాయితీ పెట్టి మౌనికను మందలించారు. దీంతో అతడిని చంపాలని నిర్ణయించుకున్న మౌనిక మద్యం తాగి వచ్చి స్వామి పడుకోగా, సంపత్ ను పిలిపించి ఇద్దరు కలిసి హత్య చేశారు. అనంతరం డెడ్‌బాడీని సంపత్ బైక్ పై తీసుకెళ్లి గ్రామ శివారులోని నేరెళ్లకుంటలో పడేశాడు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
