మగాళ్లకు ఎంత కష్టం : భర్తలను కొట్టే భార్యలు.. తెలంగాణలోనే ఎక్కువ

మగాళ్లకు ఎంత కష్టం : భర్తలను కొట్టే భార్యలు.. తెలంగాణలోనే ఎక్కువ

దేశంలో భర్తలపై దాడులు పెరుగుతున్నాయి. భార్యల చేతిలో తన్నులు తింటున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వివిధ కారణాలతో మహిళలు తమ భర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని బయో సోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. తన్నులు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటున్నారని పేర్కొంది. 

ఇండియాలో హస్బండ్స్‌‌పై జరుగుతున్న డొమెస్టిక్ వయలెన్స్‌‌పై ఈ సంస్థ చేసిన రీసెర్చ్‌‌ను, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ పబ్లిష్ చేసింది. ఇండియాలో భర్తలపై దాడులు 15 ఏండ్లలో దాదాపు ఐదింతలు పెరిగినట్టు ఈ రీసెర్చ్‌‌లో గుర్తించారు. ప్రతి వెయ్యి మంది మహిళల్లో 36 మంది భర్తలపై చేయి చేసుకుంటున్నారని తెలిపింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు. ఈ సంఖ్య 2006-లో ఏడు మాత్రమే ఉందని పేర్కొంది. ఇతర దేశాల్లో డొమెస్టిక్ వయలెన్స్‌‌ చట్టాలు మహిళలతో పాటు పురుషులకు రక్షణ కల్పించేలా ఉన్నాయని, ఇండియాలో మాత్రం మహిళలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయని రీసెర్చ్‌‌ రిపోర్ట్‌‌లో పేర్కొంది. ఈ చట్టాల్లో మార్పు తేవాల్సిన అవసరం ఉందని, లా మేకర్స్ ఆ దిశగా ఆలోచన చేయాలని స్టడీ సూచించింది. ఇతర దేశాల్లో చేసిన చట్టాలను రిపోర్ట్‌‌లో పొందుపర్చింది. 

తెలంగాణ రాష్ట్రంలో భర్తలపై భార్యల దాడులు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధానంగా మగాళ్లు తాగుడుకు బానిసలై భార్యలను వేధించడమే ముఖ్యకారణంగా కనిపిస్తోంది. గత పదేండ్లలో రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వమే ప్రతి ఊరిలో వైన్ షాపులు, ప్రతి గల్లీలో బెల్టు షాపులు పెట్టించి లిక్కర్ అమ్మకాలను ప్రోత్సహించింది. ఎక్సైజ్‌‌ ఆఫీసర్లు, సిబ్బంది టార్గెట్లు పెట్టి మరీ అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకుంది. ఎన్నికలు ఉన్నా, లేకపోయినా రాజకీయ నాయకులు జనాలకు మందు తాగించే సంస్కృతి ఎక్కువైంది. 

ఇలా రకరకాల కారణాలతో జనాలు తాగుడుకు బానిసలయ్యారు. చాలా మంది మద్యానికి బానిసలై భార్య, బిడ్డలను పట్టించుకోవడం లేదు. ఇది కాస్తా కుటుంబ కలహాలకు, వయలెన్స్‌‌కు దారి తీస్తోంది. రాష్ట్రంలో రోజూ ఏదో చోట తాగొచ్చి వేధిస్తున్న వ్యక్తులు హత్యకు గురవుతున్నారు. భార్య, కన్నబిడ్డలు, తల్లిదండ్రులే తాగుబోతులను హతమారుస్తున్న ఘటనలు బోలేడు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనాలతో తాగుడు అలవాటు మాన్పించే డీఅడిక్షన్ సెంటర్లు పెట్టాలని డాక్టర్లు కొత్త ప్రభుత్వానికి సూచిస్తున్నారు.