జాతీయ సర్వే : పట్టణాల్లో రూ. 30 వేల జీతం లేనిదే బతకలేం

జాతీయ సర్వే :  పట్టణాల్లో రూ. 30 వేల జీతం లేనిదే బతకలేం

సిటీకి వెళ్లి ఉద్యోగం చేయాలనేది అందరి కల.. అదే సమయంలో ఖర్చులు ఎలా ఉన్నాయనేది మాత్రం ఎవరూ ఆలోచించని అంశం.. ఎందుకంటే.. పల్లెల్లో పది రూపాయలు వచ్చినా.. 5 రూపాయల ఖర్చుతో జీవితాన్ని నెట్టుకొచ్చేయొచ్చు.. అదే పట్టణంలో డబుల్ ఖర్చు అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

పల్లెల్లో నెలావారీ.. తలసరి ఖర్చు.. అంటే ఒక్కో మనిషిపై నెలావారీ ఖర్చు కనీసంలో కనీసం 3 వేల 773 రూపాయలు అవుతుంది. అదే పట్టణాల్లో అయితే ఒక్కో మనిషికి.. నెలవారీ సరాసరి ఖర్చు 6 వేల 459 రూపాయలుగా ఉంది. అంటే పట్టణాల్లో ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే కనీసంలో కనీసం 26 వేల రూపాయలు అవసరం అవుతుంది. అంటే పట్టణాల్లో 30 వేల రూపాయలు లేనిదే బతకటం కష్టం అని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. 

ఓ కుటుంబం సిటీలో బతకాలి అంటే కనీసంలో కనీసం 30 వేల రూపాయలు అవసరం. ఇది కూడా ఇంటి అద్దెలు, కూరగాయలు, నిత్యావసరాలు, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు, మొబైల్ బిల్లు, ట్రాన్స్ పోర్ట్, డిజిటల్ ఖర్చులు ఇలా.. అన్నీ కలుపుకుంటే అయ్యే ఖర్చు 30 వేల రూపాయలు. 

ఇక పిల్లల చదువు, పండగలు, పబ్బాలు, కొత్త బట్టలు, చుట్టాలు, ఎంటర్ టైన్ మెంట్ ఇలా అన్నీ లెక్కలేసుకుంటే ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉంటున్నాయి. ఇంత ఖర్చుకు కారణం ఏంటో తెలుసా.. ధరలు.. ధరల మోత. 

అదే పల్లెల్లో అయితే సొంతిల్లు ఉండొచ్చు.. ధరలు తక్కువగా ఉంటున్నాయి..అయినా పట్టణాలు, సిటీల వైపే జనం ఎందుకు మొగ్గు చూపుతున్నారు అంటే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం.. జీవితంలో ఎదగాలనేకునే వారికి అవకాశాలు అందుబాటులో ఉండటం.. కెరీర్ గ్రోత్, వ్యాపారం, మెరుగైన విద్య, వైద్యం వంటి అవకాశాలతో పట్టణాలపై చూస్తున్నారు జనం.. ఇదే సమయంలో ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు ఉంటున్నాయి. 

ధనవంతులు ఎలాగైనా బతికేస్తారు.. మధ్య తరగతి కుటుంబాలే పట్టణాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ధరలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు అనేది ఈ సర్వేతో స్పష్టం అయ్యింది.