
హైదరాబాద్, వెలుగు: రెండు మూడేండ్లలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసిందని, రాబోయే రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని విమర్శించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 14 సీట్లను స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయామని, వాటిలో సగం సీట్లు గెలిచినా రాష్ట్రంలో హంగ్ వచ్చేదని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన మల్కాజ్గిరి లోక్‌సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కొన్ని తప్పిదాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. మళ్లీ అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతాం.
అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం” అని పిలుపునిచ్చారు. యూట్యూబ్ చానళ్ల అడ్డగోలు దుష్ప్రచారంతోనే ఓడిపోయామని, పాలనపై దృష్టి పెట్టడం వల్ల తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయామని కేటీఆర్అన్నారు. కారు కేవలం సర్వీసింగ్‌కే పోయిందని, రెట్టింపు వేగంతో పరుగెత్తుకు వస్తుందని చెప్పారు. ‘‘హామీల అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌ను ప్రజాకోర్టులోనే ఎండగట్టాలి. ఇందుకు సమాచార హక్కు చట్టాన్ని కార్యకర్తలు ఉపయోగించుకోవాలి. ప్రగతి భవన్‌లో విలాసవంతమైన సౌకర్యాలున్నాయని తప్పుడు ప్రచారం చేశారు. అదే నిజమైతే ఇప్పటికే ఠాంఠాం చేసేవాళ్లు” అని అన్నారు. తాము 6 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులిచ్చామని, ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడంతో ఈ విషయం కార్యకర్తలకు కూడా తెలియలేదన్నారు. పార్టీ కమిటీలు వేయకపోవడంతోనూ నష్టం జరిగిందని, ఇకపై అలా జరగదని చెప్పారు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా?
‘‘200 యూనిట్లలోపు కరెంట్ వాడే వారు జనవరి నుంచి బిల్లులు కట్టొద్దని రేవంత్‌రెడ్డి, గత నవంబర్నుంచే కట్టొద్దని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజలకు చెప్పారు. వారి మాటలనే నేను గుర్తుచేశాను. కరెంట్ బిల్లులు కట్టొద్దన్న వాళ్ల మాటలు గుర్తు చేస్తే నాది విధ్వంసకర మనస్తత్వమని డిప్యూటీ సీఎం అంటున్నారు. నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు సోనియాగాంధీనే కడుతారని కాంగ్రెస్ లీడర్లు ఎన్నికల ప్రచారంలో చెప్పారని, ఇప్పుడు వచ్చిన బిల్లులను సోనియాగాంధీకే పంపుదామని, ఇందుకు ప్రజలను సమాయత్తం చేయాలని సూచించారు. నిరుద్యోగ భృతిపైనా అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం మాట తప్పారని, పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు.
చిన్న కారణాలతోనే ఓడిపోయాం: హరీశ్‌రావు
చిన్న కారణాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడియామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, వాటిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలు అద్భుతంగా మాట్లాడుతున్నారని, వాస్తవాలు చెప్తున్నారని అన్నారు. బీఆర్ఎస్కు విజయాలే కాదు అపజయాలు కూడా ఉన్నాయని, అపజయాలతో కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. ‘‘2009లో పది సీట్లలోనే గెలిచాం. అయినా నిరాశ చెందలేదు. ఈ ఓటమితో కార్యకర్తలెవరూ కుంగిపోవద్దు. భవిష్యత్‌లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మనకు ఇది పరీక్షా సమయం. లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతున్నదని సర్వేలు చెప్తున్నాయి” అని అన్నారు.
బీఆర్ఎస్‌ను బొందపెట్టే మొనగాడు పుట్టలే: కడియం
బీఆర్ఎస్‌ను బొందపెట్టే మొనగాడు భూమి మీద ఇంకా పుట్టలేదని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్‌ను వంద మీటర్ల లోతున బొంద పెడుతామని రేవంత్ అన్నారని, ఆయనకాదు వాళ్ల అయ్య తరం కూడా కాదని మండిపడ్డారు. దావోస్‌లో తెలంగాణ పరువును రేవంత్ తీశారని ఫైరయ్యారు. గుంపు మేస్త్రీ పనితనం ఏమిటో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ లాంటి నాయకులకే ఓటమి తప్పలేదని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పాలనలో క్రమశిక్షణ లేదన్నారు. తెలంగాణకు కేసీఆర్పాలనే దిక్కు అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే
మోదీకి, రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ భయపడబోదని కేటీఆర్ అన్నారు. ఎట్టికైనా మట్టికైనా తెలంగాణ ఏకైక గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్నాయి. ఇటీవల మోదీని రేవంత్, భట్టి కలిసినపుడు బీఆర్ఎస్ ను ఫినిష్ చేసేందుకు పూర్తిగా సహకరిస్తామని అన్నారని పత్రికల్లో వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ఒక్కటేనన్నది ఇది రుజువు చేస్తున్నది. దీనిపై మైనార్టీల్లో ఉన్న అపోహలు తొలగించాలి” అని అన్నారు.
గతంలో రాష్ట్రంలో పెట్టుబడి పెడుతామంటే అదానీకి బీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని చెప్పారు. అదానీపై పోరాడుతున్నట్టు రాహుల్ చెప్తుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం అదానీకి రెడ్‌కార్పెట్ పరుస్తున్నారని విమర్శించారు. మల్కాజ్గిరి లోక్‌సభ పరిధిలో అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచామని, భారీ మెజార్టీతో ఎంపీ సీటు గెలిచేందుకు కలిసికట్టుగా పని చేద్దామన్నారు. ‘‘అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సభ్యత్వం రద్దు చేస్తాం. అవిశ్వాసంపై ఓటింగ్ రోజు విప్ జారీ చేస్తాం. దాన్ని ఎవరు ధిక్కరించినా చర్యలు తప్పవు. మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీ కోసమే పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని చెప్పారు.