కేసీఆర్ను పిల్వలేదా? బెంగళూరు విపక్షాల మీటింగ్పై సర్వత్రా ఆసక్తి

 కేసీఆర్ను పిల్వలేదా?  బెంగళూరు విపక్షాల మీటింగ్పై సర్వత్రా ఆసక్తి
  • ఈ నెల తేదీల్లో విపక్షాల రెండో భేటీ
  • అఖిలేశ్ దౌత్యం ఫలించిందా..లేదా?
  •  బెంగళూరు మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి
  • పాట్నా సమావేశానికి వచ్చింది 15 పక్షాలే!
  • ఈ సారి 24 పార్టీలకు ఆహ్వాన పత్రాలు
  • 23 పార్టీల పేర్లు వెల్లడించిన కూటమి పెద్దలు
  • ఆ ఒక్క పార్టీ ఏది..? బీఆర్ఎస్సా..? మరొకటా?

విపక్షాల భేటీకి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను  పిలిచారా..? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. జూన్ 23న పాట్నాలో బీహార్ సీఎం నితీశ్​ అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్ జులై 4న ప్రత్యేక విమానంలో వచ్చి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ భావసారూప్యత కలిగిన పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగానే కేసీఆర్ ను కలిసినట్టు చెప్పారు. కేసీఆర్ ప్రసంగాలు మాత్రం కూటమికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గానే ఉంటున్నాయి. కాంగ్రెస్ దేశానికి శత్రువు అని, 75 ఏండ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని ప్రతి వేదికపైనా మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉచిత కరెంటుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచితంగా మాట్లాడారని పేర్కొంటూ బీఆర్ఎస్ ఏకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగింది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా మూడు గంటలు కావాలా..? మూడు పంటలు కావాలా..? అంటూ ట్వీట్ చేయడం మరింత హీట్ ను పెంచింది. దీనికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ తరుణంలో జులై 17, 18 తేదీల్లో బెంగళూరులో జరగనున్న విపక్షాల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సమావేశానికి రావాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీకి లేఖ పంపారు. ఢిల్లీ సర్వీసులపై కేంద్రం తీసుకురానున్న ఆర్డినెన్స్ పై రాజ్యసభలో తమకు మద్దతు ప్రకటించే వరకు సమావేశానికి దూరంగా ఉంటామని ఆప్ అగ్రనేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ హాజరు అనుమానమేనని తెలుస్తోంది. గత సమావేశానికి హాజరైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువునా చీలింది. ఆ పార్టీ ముఖ్యనేత అజిత్ పవార్ తన సహచరులతో ఎన్డీఏ కూటమిలో చేరారు. ఆయన ఏకంగా డిప్యూటీ సీఎం పదవినే స్వీకరించడం గమనార్హం. 

కొత్తగా 8 పార్టీలకు ఆహ్వానం 

పాట్నాలో జరిగిన సమావేశానికి 15 రాజకీయ పక్షాలు హాజరయ్యారు. ప్రస్తుతం 24 పార్టీలకు ఆహ్వానం పంపారు. ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్ఎస్పీ, ఫార్వార్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్​) కేరళ కాంగ్రెస్ (మణి) గత నెల 23న పాట్నాలో జరిగిన మీటింగ్ కు హాజరు కాని పార్టీలు.. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల పేరు లేదు. మొత్తం 24 పార్టీలకు ఆహ్వానం పంపినట్టు చెబుతున్న కూటమి నేతలు.. 23 పార్టీల పేర్లను మాత్రమే రివిల్ చేశారు. ఆ ఒక్క పార్టీ ఏది..? అనేది చర్చనీయాంశంగా మారింది.! అది టీడీపీనా..? బీఆర్ఎస్సా అనేది హాట్ టాపిక్ గా మారింది.

అఖిలేశ్​ఎందుకు వచ్చినట్టు

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్ జులై 4వ తేదీన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ‘‘సబ్​కా లక్ష్య్ ఏక్​హై.. బీజేపీకో హఠానే చహతాహై ఇస్ కేలియే రాస్తా బనారే”అని అఖిలేశ్​అన్నారు. తాను కేసీఆర్​తో చర్చించేందుకు వెళ్తున్నానని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే అందరి లక్ష్యమైనప్పుడు ఇందుకు అందరూ కలవాల్సిన​అవసరం ఉందన్నారు. వీరిద్దరూ దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. వీళ్లిద్దరూ ఏం మాట్లాడారు. ‘‘సబ్​కా లక్ష్య్ ఏక్​హై’అంటూ హైదరాబాద్ వచ్చిన అఖిలేశ్​ యాదవ్ దౌత్యం ఫలించలేదా..? కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు కేసీఆర్ అంగీకరించలేదా..? బీఆర్ఎస్ కూటమిలో చేరడాన్ని మిగతా పార్టీలు ఒప్పుకోవడం లేదా..? అన్న చర్చ మొదలైంది.