కేసీఆర్​ కేబినెట్​లో వెంచర్ల శాఖ వస్తదేమో

కేసీఆర్​ కేబినెట్​లో వెంచర్ల శాఖ వస్తదేమో
  • జాగా కనిపిస్తే చాలు టీఆర్​ఎస్​ లీడర్లు కబ్జా చేస్తున్నరు : సంజయ్​
  • ప్రగతిభవన్​ స్క్రిప్ట్​నే వరంగల్​ సభలో రాహుల్​ చదివిండు
  • మేం ఎక్కడ పోరాటాలు చేసినా డైవర్ట్​ చేసేందుకు కాంగ్రెస్​ ప్రయత్నిస్తున్నది
  • ఇదంతా టీఆర్​ఎస్, కాంగ్రెస్​  పొత్తులో భాగమేనని ఆరోపణ

మహబూబ్​నగర్​, వెలుగు :  ‘‘టీఆర్​ఎస్​ లీడర్లు ఇంటర్నేషనల్​ దొంగలు. జాగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నరు. కేసీఆర్​ కేబినెట్​లో కొత్తగా వెంచర్ల శాఖను తీసుకొస్తరేమో” అని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర–2 శనివారం రాత్రి మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక సిగ్నల్​ గడ్డ వద్ద ఏర్పాటు చేసిన సభలో సంజయ్​ మాట్లాడారు. జడ్చర్ల నియోజకవర్గంలో రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ఎస్సీ, ఎస్టీల భూములను లాక్కునే  ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ‘ధరణి’లో అసైన్డ్​ భూములుగా చూపించి, వాటిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొందరి భూములను లాక్కొని రియల్​ ఎస్టేట్​ వెంచర్లు, ఫ్యాక్టరీలు, టీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయాలు కడుతున్నారని ఆరోపించారు. భూములను లాక్కుంటే ఎక్కడికి పోయి బతుకుతారని ఆయన ప్రశ్నించారు. జడ్చర్లలో ఇప్పటి వరకు డబుల్​ బెడ్రూం ఇండ్లను ఎందుకు ఇవ్వలేదో స్థానిక ఎమ్మెల్యేను ప్రజలు ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘ఇక్కడి నాయకులు కేసీఆర్​ గడీల వద్ద కాపలా కాస్తున్నరు. అధికారం అడ్డుపెట్టుకొని భూ దందాలు, ఇసుక దందాలు చేస్తూ గుంటనక్కల్లా సంపాదించుకుంటున్నరు. ఆఖరికి దేవాలయాల భూములను కూడా ఆక్రమించి అమ్ముకున్నరు” అని ఆరోపించారు. కేసీఆర్​ పాలనలో చివరికి కుల వృత్తుల వాళ్లు కూడా బతకలేకపోతున్నారని సంజయ్​ అన్నారు. ‘‘రాష్ట్రంలోకి టూరిస్టులు వచ్చారని కేటీఆర్​ అంటున్నడు. బీజేపీ లీడర్లు టూరిస్టులు కాదు. మా సత్తా ఏందో ముందు ముందు తెలుస్తది. ముందు ఉమ్మడి పాలమూరుకు మీరేం చేశారో సమాధానం చెప్పండి. దేశమంతా కేసీఆర్​ ఇజ్జత్​ లేని మనిషి అని అంటున్నరు. ఢిల్లీలో గంట కూడా దీక్ష చేయలేకపోయిండని విమర్శిస్తున్నరు. ఆయనది మొత్తం నటనే అని అందరికీ తెలిసిపోయింది” అని అన్నారు. 

కృష్ణమ్మను ఏపీకి తాకట్టు పెట్టిన్రు : డీకే అరుణ
కృష్ణమ్మను ఏపీకి కేసీఆర్​తాకట్టు పెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ‘‘ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే, మీరెందుకు పూర్తి చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి” అని కేసీఆర్​ను డిమాండ్​ చేశారు. పాలమూరు–రంగారెడ్డి స్కీం కింద రైతుల నుంచి భూములు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేయలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్​రెడ్డి మండిపడ్డారు.

కేసీఆర్​, రాహుల్​ కొత్త నాటకాలు
రాహుల్​ గాంధీ తెలంగాణకు ఎందుకు వచ్చాడో సమాధానం చెప్పాలని బండి సంజయ్​ డిమాండ్​ చేశాడు. బీజేపీ రైతు దీక్ష చేపడితే, కాంగ్రెస్​ ఎక్కడో మరో దీక్ష చేస్తదని, తాము ఎక్కడ పోరాటాలు చేసినా దాన్ని డైవర్ట్​ చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఇదంతా టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పొత్తులో భాగమేనని ఆరోపించారు.  బీజేపీకి అనుకూలంగా ఇంటెలిజెన్స్​, గ్రౌండ్​ రిపోర్ట్​ రావడంతో కేసీఆర్​, రాహుల్​ గాంధీ కలిసి కొత్త నాటకాలు మొదలు పెట్టారని, ఇదంతా కేసీఆర్​ ప్లాన్​ అని అన్నారు. వరంగల్​లో  జరిగిన కాంగ్రెస్​ సభకు ప్రగతి భవన్​ నుంచే స్క్రిప్ట్​ పోయిందని, దాన్నే రాహుల్​ చదివారని విమర్శించారు. కాంగ్రెస్​కు దేశంలో ఎక్కడ ప్రజాదరణ లేదని, ఇటీవల జరిగిన ఎన్నికల్లోనే ఆ విషయం బయట పడిందన్నారు.