వాషింగ్టన్: ఇరాన్‌తో నెల రోజులకు పైగా సాగుతోన్న యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఈ యుద్ధం ముగియవచ్చని పేర్కొన్నారు. బుధవారం (ఏప్రిల్ 1) ఓవల్ ఆఫీస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. యుద్ధం ముగించేందుకు అమెరికాతో అగ్రిమెంట్ చేసుకోవాలని ఇరాన్ తహతహలాడుతోందని అన్నారు.
🚨BREAKING: President Trump suggests conflict with Iran will be over soon: "I think 2-3 weeks". pic.twitter.com/0R0gxf1h5O
— Breaking911 (@Breaking911) March 31, 2026
త్వరలోనే ఈ డీల్‌ను ఫినిష్ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఇరాన్ నాయకత్వం గత ప్రభుత్వాలకు భిన్నంగా ఉందని.. వీరు తెలివిగా ఆలోచిస్తున్నారన్నారు. ట్రంప్ తన తాజా కామెంట్స్‌తో మధ్యప్రాచ్యాన్ని అల్లకల్లోలం చేసి, ప్రపంచ ఇంధన మార్కెట్లకు అంతరాయం కలిగించిన నెల రోజుల సంఘర్షణకు ముగింపు పలికే అవకాశం ఉందని సంకేతమిచ్చారు.
అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ తీరు
త్వరలోనే ఒప్పందం కుదరుతుంది.. యుద్ధం ముగుస్తుందని అమెరికా అంటుంటే.. ఇరాన్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతోంది. అమెరికాతో చర్చలు జరిపే సమస్యే లేదని.. తమపై చేసిన దాడులకు ప్రతీకారం తప్పక తీర్చుకుంటామంటూ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తామంటోంది. ఇందులో భాగంగానే యుద్ధ విరమణ కోసం కోసం అమెరికా ప్రతిపాదించిన 15 సూత్రాల శాంతి ప్రణాళికను కూడా ఇరాన్ నిర్ద్వందంగా తిరస్కరించింది.
అణ్వాయుధాల తయారీ నిలిపివేయడం వంటి అమెరికా డిమాండ్లను ఎన్నటికీ ఇరాన్ అంగీకరించే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. రానున్న రోజుల్లో తమపై ఏకపక్షంగా యుద్ధానికి దిగినందుకు అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా భూతల దాడులు చేసిన ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఇరాన్ తీరుకు విరుద్ధంగా అమెరికా ప్రకటనలు ఉన్నాయి. అసలు చర్చలే జరపడం లేదని ఇరాన్ అంటుంటే.. చర్చలు జరుగుతున్నాయి.. యుద్ధం ముగుస్తుందంటూ అమెరికా చెబుతోంది.
