ప్రాజెక్టులో అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తం

ప్రాజెక్టులో అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన అబద్ధం, మోసమని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రాజెక్టులో నాణ్యత లేని పనులు చేశారని, ఇరిగేషన్ అధికారులు మాత్రం కాంట్రాక్టర్ తప్పేమీ లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని చెప్పారు. బుధవారం జలసౌధలో ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ ను కలిసి కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలపై వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా జలసౌధ ముందు పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. అంతకుముందుకు పంజాగుట్ట సర్కిల్ లో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. 

కాళేశ్వరంలో అవినీతిపై రెండు రోజుల్లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఎవరూ లేనంట్లు అన్ని పనులూ మెఘా కంపెనీకే ఇస్తున్నారని, మెఘా కృష్ణారెడ్డి ప్రాజెక్టులపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఆయన కాంట్రాక్టులను హోల్డ్ లో పెట్టాలన్నారు. కాంట్రాక్టర్లను సీఎం వెనుకేసుకువస్తూ, క్లౌడ్ బరస్ట్ వల్లే మోటార్లు మునిగాయన్నట్లు కామెంట్లు చేయడం 
హాస్పాస్పదమన్నారు.