త్వరలో ఇంటర్నేషనల్ లెవెల్ స్కిల్ యూనివర్సిటీ: శ్రీధర్ బాబు

త్వరలో ఇంటర్నేషనల్ లెవెల్ స్కిల్ యూనివర్సిటీ: శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ అంశంపై అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు మంత్రివర్గ సహచరులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో  ‘తెలంగాణాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇంటర్న్​ షిప్, ఉద్యోగాల కల్పన, విద్యార్థుల అభివృద్ధి’ అనే అంశంపై గురువారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దానికి చీఫ్ గెస్ట్ గా శ్రీధర్ బాబు హాజరై మాట్లాడారు. విద్యా, ఐటీ రంగాల్లో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. సర్కారు కాలేజీల్లో అభ్యసించే ఏ స్టూడెంట్ కూడా స్కిల్స్ లేకుండా ఉపాధి అవకాశాలు కోల్పోరాదని.. ఆ దిశగా తెలంగాణ విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కోరారు. 

డిగ్రీ చదువుతున్నప్పుడే స్టూడెంట్లు రాష్ట్రంలోని ప్రముఖ పరిశ్రమల్లో ఇంటర్న్​ షిప్ పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తద్వారా పరిశ్రమలకు కావాల్సిన రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి విద్యాసంస్థలకు అవకాశం ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్ లో ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ఉన్నాయని, పలు పెద్ద కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు సర్కారుతో ఎంఓయూలు చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అటు సర్కారుతో, ఇటు పారిశ్రామిక సంస్థలతో కోఆర్డినేషన్​ కోసం ఓ ప్రత్యేక సెల్​ను ఏర్పాటు చేసి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో కౌన్సిల్, బీఎఫ్​ఎస్​ఐ మధ్య కుదిరిన ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. అనంతరం కౌన్సిల్ రూపొందించిన గణాంకాల నివేదిక, డైరీని మంత్రి ఆవిష్కరించారు.