సమాచార కమిషన్ పని తీరులో మార్పు వచ్చేనా ?

సమాచార కమిషన్ పని తీరులో మార్పు వచ్చేనా ?

సమాచార హక్కు చట్టం అమలుపై గత  బీఆర్ఎస్  ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం వల్ల దాదాపు చట్టం నిర్వీర్యం అయ్యే పరిస్థితికి వెళ్లిపోయింది.  కానీ,  కాంగ్రెస్ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సమాచార కమిషనర్లను  నియమించడంతో  మరోసారి స.హ. చట్టం దరఖాస్తుదారులకు ఊపిరి పోసినట్లు అయ్యింది.  గత  బీఆర్ఎస్  ప్రభుత్వంలో  వేల దరఖాస్తులు సమాచార కమిషన్​ వద్ద  పెండింగ్​లో  ఉండడంతో వాటిని క్లియర్ చేసేందుకు ప్రస్తుత ఆర్టీఐ చీఫ్ కమిషనర్​తోపాటు తోటి  కమిషనర్లు చేస్తున్న కృషి అభినందనీయమే.

పెండింగ్ కేసుల క్లియరెన్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి ఏకంగా ఈ సమావేశాలకు కమిషనర్లు సైతం హాజరై స.హ. చట్టం అమలుపై అన్ని ప్రభుత్వ శాఖల పీఐఓలకు  అవగాహన  కల్పిస్తున్నారు.  ఈ  అవగాహన  సమావేశాలు నిర్వహించినా ఇప్పటికీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఆర్టీఐ దరఖాస్తులకు ప్రభుత్వ శాఖల అధికారులు సమాచారం ఇవ్వకపోవడం, అప్పీల్ చేసినా స్పందించకపోవడం, చివరకు సమాచార  కమిషన్​కు ఫిర్యాదు చేసినా అధికారుల్లో మార్పు రాకపోవడం శోచనీయం.

పైగా సమాచార కమిషన్ నోటీసులు జారీ చేసి హియరింగ్​కు  పిలిచాక కూడా అరకొర , అసంపూర్తి సమాచారం ఇస్తున్నవారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం బాధాకరం.  ప్రభుత్వ శాఖల అధికారుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు.  వేలల్లో కమిషన్ వద్ద కేసులు ఉంటే వారిలో రూల్స్ పాటించని వారికి విధించిన జరిమానాలు కేవలం రెండంకెలు కూడా దాటడం లేదన్నది బహిరంగ రహస్యమే. 

సమాచార  కమిషన్ కార్యాలయం అధికారులు సైతం దరఖాస్తుదారులకు కాకుండా ప్రభుత్వ శాఖల అధికారులకు సహకరిస్తుండడంతో రాష్ట్రంలో ఆర్టీఐ చట్టం ఇప్పటికీ  పూర్తిస్థాయిలో  అమలుకావడం లేదు. ఇప్పటికైనా  సమాచార చీఫ్ కమిషనర్  స్పందించి స.హ. చట్టం అమలులో  ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ శాఖల అధికారులపై సెక్షన్ 20(1) ప్రకారం జరిమానా,  సెక్షన్ 19(8) కింద దరఖాస్తుదారుడికి  నష్ట పరిహారం, సెక్షన్ 20(2)  ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ దరఖాస్తుదారులు కోరుతున్నారు. 

ఆడెం ఆంజనేయులు

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.