జేపీఎస్​లను తీసేస్తే ప్రగతి భవన్​ను ముట్టడిస్తం.. బండి సంజయ్ వార్నింగ్

జేపీఎస్​లను తీసేస్తే  ప్రగతి భవన్​ను ముట్టడిస్తం.. బండి సంజయ్ వార్నింగ్
  • ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తరా?
  • సీఎం, మంత్రులను బయట తిరగనియ్యబోమని కామెంట్
  • సెక్రటరీలకు అండగా ఉంటామని హామీ

హైదరాబాద్, వెలుగు : ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని 11 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్  నోటీసులు జారీ చేయడాన్ని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్  తీవ్రంగా ఖండించారు.  జూనియర్  పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయమైనదని ఆయన అన్నారు. వారు సమ్మె కొనసాగించాలని, వారికి బీజేపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే, కేసీఆర్ ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం ఓ ప్రకటనలో సంజయ్  హెచ్చరించారు.  సీఎం కేసీఆర్​కు వారం రోజులు గడువు ఇస్తున్నామని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడి జూనియర్  పంచాయతీరాజ్ కార్యదర్శులందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే సీఎం సహా మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని,  ప్రగతి భవన్​ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ‘‘

జూనియర్  పంచాయతీ కార్యదర్శులు చేసిన తప్పేంది? పరీక్షలు పాసై ఉద్యోగాల్లో చేరి నిబంధనల ప్రకారం పనిచేస్తున్నారు. ఏ ఉద్యోగానికైనా  ప్రొబేషనరీ పీరియడ్  ఏడాదో, రెండేళ్లో ఉంటుంది. కానీ, వారికి మాత్రం మూడేళ్లు పెట్టినా పనిచేశారు. రెగ్యులర్  చేయకుండా మళ్లీ ఏడాది గడువు పెంచడం ఎంత వరకు సమంజసం?  మనసులో ఎంత బాధ ఉన్నా రాత్రింబవళ్లు పనిచేస్తూ నాలుగేళ్లపాటు ప్రొబేషనరీ పీరియడ్ ను పూర్తి చేశారు. అయినా వారిని రెగ్యులరైజ్  చేయకపోవడం అన్యాయం” అని సంజయ్  వ్యాఖ్యానించారు.

జూనియర్  పంచాయతీ కార్యదర్శుల విషయంలో ఇచ్చిన మాటను ప్రభుత్వం తప్పిందని ఆయన ఫైరయ్యారు. ‘‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ జేపీఎస్​లు సమ్మె చేస్తే షోకాజ్ నోటీసులిస్తారా? మరి మాట తప్పిన కేసీఆర్  ప్రభుత్వాన్ని ఏం చేయాలి” అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ,  నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు స్కీమ్​ అమలు చేస్తానని హామీలిచ్చి మాట తప్పిన కేసీఆర్ ను ఏం చేయాలని ఆయన నిలదీశారు.

చిరుద్యోగులను బెదిరిస్తున్నరు:

ప్రవీణ్  కుమార్జేపీఎస్  లాంటి చిరుద్యోగులను బెదిరించడం ఒక్కటే కేసీఆర్ ప్రభుత్వానికి తెలుసని  బీఎస్పీ  స్టేట్  ప్రెసిడెంట్  ఆర్ఎస్  ప్రవీణ్  కుమార్ విమర్శించారు. ఇటీవల ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగిందని సోమవారం ఆయన ట్వీట్  చేశారు. తమను రెగ్యులరైజ్  చేయాలని జేపీఎస్ లు అడుగుతున్నారని, ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా అదే చెప్పారని ఆయన గుర్తుచేశారు. రెగ్యులరైజ్  చేయకుండా జేపీఎస్ లతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని ఆయన ఫైర్  అయ్యారు

యూనియన్  పెట్టుకుంటే నోటీసులా: సీఐటీయూ

రెగ్యులర్  చేయాలన్న న్యాయమైన డిమాండ్​తో సమ్మె చేస్తున్న జేపీఎస్ లకు నోటీసులు ఇవ్వటం సరికాదని సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు, పాలడుగు భాస్కర్  అన్నారు. చర్చలకు పిలిచి సామరస్యంగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలన్నారు.

కేసీఆర్, కేటీఆర్, మంత్రులు ‘కేరళ స్టోరీ’ చూడాలి 

కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ, క్రిస్టియన్  అమ్మాయిలను ఐఎస్ వంటి టెర్రరిస్టు సంస్థలు మాయమాటలతో లోబర్చుకుంటున్నాయని బీజేపీ స్టేట్  చీఫ్  బండి సంజయ్  అన్నారు. లవ్  జిహాద్  పేరుతో తెలంగాణలో కూడా దారుణాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. ‘కేరళ స్టోరీ’ ని సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, మంత్రులు చూడాలని సంజయ్ హితవు పలికారు. సోమవారం కాచిగూడలోని ఓ థియేటర్ లో ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రా రెడ్డి, ఎన్వీఎస్ఎస్  ప్రభాకర్ తదితరులతో ఆయన ‘ద కేరళ స్టోరీ’ సినిమా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈనెల 14న కరీంనగర్ లో నిర్వహించనున్న ‘హిందూ ఏక్తా యాత్ర’ కు కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్, నిర్మాతలను ఆహ్వానిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులన్నింటి నుంచి ఈ సినిమాను మినహాయించాలని కోరారు. ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ కేరళ స్టోరీ సినిమా సెక్యులర్ రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలన్నారు. సినిమాలో యదార్థ గాధను చూపించారని, వినోదం కోసం సినిమా తీయలేదని చెప్పారు.